Tuesday, November 19, 2024

Big story : జోరందుకోనున్న పామాయిల్‌ సాగు.. నాలుగేళ్లలో 10 లక్షల ఎకరాల్లో పంట

ప్రాసెసింగ్‌లో భారీ పెట్టుబడులకు ఛాన్స్‌
గణనీయంగా తగ్గనున్న దిగుమతులు
దేశ ఆర్థిక వ్యవస్థకే ఊపు తేనున్న తెలంగాణ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రానున్న రోజుల్లో దేశంలోనే పామాయిల్‌ తయారీలో తెలంగాణ నెంబర్‌వన్‌ కానుందని అంతర్జాతీయ వ్యాపార కన్సల్టెన్సీలు అంచనా వేస్తున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఇందుకు ఎంతగానో దోహదం చేస్తున్నాయని అవి పేర్కొంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం నిర్మించిన ఎత్తిపోతల పథకాలతో నీటి పారుదల సౌకర్యం పెరిగిందని, దీంతో రాష్ట్రంపామాయిల్‌ సాగుకు అనుకూలంగా మారిందని పామాయిల్‌ తయారీ రంగంలో పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్న కంపెనీలు పేర్కొంటున్నాయి. ఒక్కో పామాయిల్‌ చెట్టుకు రోజుకు 265 లీటర్ల నీళ్లు అవసరయమవుతాయని వారు చెబుతున్నారు. గతంలో తెలంగాణలో వేసవిలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉండేదని, ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవడం వల్ల ఆ సమస్య లేదని పామాయిల్‌ సాగుకు అనుకూలతలు పెరిగాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దేశం ప్రతి ఏటా 14 మిలియన్‌ టన్నుల వెజిటబుల్‌ ఆయిల్‌ దిగుమతి చేసుకుంటుండగా ఇందులో 8.5 మిలియన్‌ టన్నులు పామాయిలే కావడం గమనార్హం. ఈ దిగుమతుల కోసం దేశం ఏకంగా ప్రతి ఏటా 19 బిలియన్‌ డాలర్ల దాకా అత్యంత విలువైన విదేశీ కరెన్సీని ఖర్చు చేయాల్సివస్తోందని, ఇది ట్రేడ్‌ డెఫిసికు దారి తీయడమే కాక ద్రవ్యోల్బణాన్ని పెంచుతోందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఏటా కేవలం 3 లక్షల టన్నుల పామాయిల్‌ మాత్రమే ఉత్పత్తవుతోంది. ఒకవేళ తెలంగాణ గనుక తక్కువలో తక్కువ రానున్న రోజుల్లో 2మిలియన్‌ టన్నుల పామాయిల్‌ను ఉత్పత్తి చేసినా ఇది దేశ ఆర్థిక వ్యస్థకు ఎనలేని మేలుచేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వచ్చే 4 ఏళ్లలో తెలంగాణ 20 లక్షల ఎకరాల్లో పామాయిల్‌ సాగు…

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అన్నింటి ప్రభావంతో ఏటా కేవలం 35 వేల ఎకరాల్లో మాత్రమే కొత్తగా పామాయిల్‌ సాగు పెరుగుతోంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు, సబ్సిడీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీలో భాగంగా ఇస్తున్న రాయితీలు అన్ని కలిపి వచ్చే నాలుగేళ్లలో ఏకంగా 20 లక్షల ఎకరాల్లో కొత్తగా పామాయిల్‌ సాగవుతుందని అంతర్జాతీయ వ్యాపార కన్సెల్టెన్సీలు, పామాయిల్‌ తయారీ కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఇంత మొత్తంలో కాకపోయినా ఇందులో సగం అంటే 10 లక్షల ఎకారాల్లో సాగవనున్న 20 లక్షల టన్నుల పామాయిల్‌ దేశ ఆర్థిక వ్యవస్థ రూపు రేఖలను మార్చే అవకాశముందని సంస్థ అంచనా వేస్తున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థకే కాకుండా పామాయిల్‌ పండించిన రైతుకు కూడా ధరలను బట్టి ఎకరాకు సంవత్సరానికి రూ.2 లక్షలపైనే లాభం ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

- Advertisement -

పామాయిల్‌ మొక్కలను రికార్డుస్థాయిలో దిగుమతి చేసుకుంటున్న టీఎస్‌ ఆయిల్‌ ఫెడ్‌..

పామాయిల్‌ సాగుకు అత్యంత ముఖ్యమైనవి మంచి నాణ్యత కలిగిన పామాయిల్‌ మొక్కలు. ఇక్కడి రైతులు గతంలో పామాయిల్‌ సాగు చేయాలంటే ఇందుకు కావాల్సిన మొక్కలు లేక సతమతమయ్యేవారు. ఇప్పుడు ఆ సమస్య లేకుండా టీఎస్‌ ఆయిల్‌ ఫెడ్‌ రైతులకు కావాల్సినపుడల్లా కొన్ని లక్షల సంఖ్యలో మొక్కలను ఇండోనేసియా, మలేసియా తదితర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. దీంతో రైతులకు కావాల్సినన్నిపామాయిల్‌ మొక్కలు అందుబాటులో ఉంటున్నాయని టీఎస్‌ఆయిల్‌ ఫెడ్‌ ఉన్నతాధికారులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement