తొర్రూరు, ప్రభ న్యూస్ : సాంప్రదాయ పంట అయినా పామాయిల్ పంటలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని టీఎస్ ఆయిల్ ఫెడ్ చైర్మన్ రామకృష్ణారెడ్డి అన్నారు. మండలంలోని హరిపిరాల గ్రామ శివారులో ఉన్న పామాయిల్ నర్సరీని.. స్థానిక ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్యతో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనరల్ కేటగిరి వారికి 80 శాతం, బీసీలకు 90 శాతం,ఎస్సీ ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ లభిస్తుందన్నారు.ఆయిల్ ఫామ్ పంట సాగు చేసే రైతులు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి సాధించవచ్చన్నారు. టన్నుకు రూ.19, 800 ఆదాయం వస్తుందని, మూడేళ్లపాటు పంటను కాపాడితే దాదాపు 30 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని స్పష్టం చేశారు. జిల్లాలో ఈ ఏడాది 1200 ఎకరాల్లో సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎకరాకు 15 నుండి 20 టన్నుల దిగుబడి వస్తుందని, ఎకరాకు రూ.36 వేలు సబ్సిడీ ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని చెప్పారు.
సాంప్రదాయ పంటల సాగుతో రైతులు నష్టపోకుండా పంటల మార్పిడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఆయిల్ ఫెడ్ ద్వారానే ఆయిల్ పామ్ ను సాగు చేసేందుకు ప్రభుత్వం అనుమతిస్తుందని వెల్లడించారు. ఆయిల్పామ్ సాగు చేసే రైతులకు ఒక ఎకరానికి రూ. 30వేలు సబ్సిడీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.తెగుళ్లు చీడ పీడల బాధలు ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ ఫామ్ పంటలో అతి తక్కువ అని,ఈ పంటకు కోతుల బెడద ఉండదన్నారు. ఆయిల్ ఫామ్ సాగుకు ఒక ఎకరానికి అయ్యే ఖర్చు రూ. 30 వేల నుండి రూ.40 వేల వరకు ఉంటుందని కాగా వచ్చే ఆదాయం ఒక ఎకరాకు రూ. 70 వేల నుండి రూ. 90 వేల వరకు ఉంటుందన్నారు. ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య మాట్లాడుతూ జిల్లాలో ఏకైక నర్సరీ 45 ఎకరాల విస్తీర్ణంలో హరిపిరాలలో నెలకొల్పినట్లు తెలిపారు.ఈ నర్సరీలో రూ.7 ఏడు కోట్ల వ్యయంతో 4 లక్షల మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు.మండలంలోని గోపాల గిరి లో ఆయిల్ఫామ్ పరిశ్రమ సైతం సిద్ధమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ ఏరియా అధికారి సురేష్, నర్సరీ ఇంచార్జి హరీష్, కిన్నెర సతీష్ తదితరులు పాల్గొన్నారు.