హైదరాబాద్, ఆంధ్రప్రభ: సాగునీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. పెండింగ్ ప్రాజెక్టుపై భారీ నీటిపారుదల శాఖ సమీక్షలు నిర్వహిస్తూ పనుల్లో వేగం పెంచేందుకు పరిపాలనా పరమైన నిర్ణయాలు తీసుకుంటుంది. తొలిదశలో దక్షిణ తెలంగాణకు జీవధారైన పాలమూరు రంగారెడ్డిప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ప్రాజెక్టు పాలమూరు చేవెళ్ల పేరుతో జలయజ్ఞంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మొదలు పెట్టాగా ప్రాజెక్టు పేరును పాలమూరు రంగారెడ్డి గా పేరుమార్చి బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2015 మార్చిలో భూత్ఫూర్ లో పనులు ప్రారంభించినప్పటికీ పనుల్లో వేగం పెంచక, అనుమతులు సాధించలేక నత్తనడక నడిసింది.
ఇప్పటివరకు కేవలం నార్లాపూర్ పంపు హౌజ్ మాత్రమే పూర్తి కావడంతో ప్రాజెక్టు పనులను పూర్తిగా సమీక్షించి అవసరమైతే నిపుణుల సలహా మేరకు డిజైన్లు మార్చి నిర్మాణం పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆంతరంగిక సమీక్షలు జరుపుతూ ఎన్నికల కోడ్ ముగియగానే పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా 7.95 టీఎంసీ సామర్థ్యంతో నార్లాపూర్ పంపు హౌజ్ పనులు పూర్తి చేశారు. భూగర్భంలో 145 మెగావాట్ల 9పంపులు ఏర్పాటు చేసి ఒక పంపు ట్రైయల్ రన్ పూర్తి చేశారు. అలాగే 5.91 టీఎంసీ సామర్థ్యంతో 10 పంపులతో ఎదుల పంపుహౌజ్, 14.47 టీఎంససీల సామర్థ్యం, 10 పంపులతో వట్టెం పంపుహౌజ్ పనులు దాదాపుగాపూర్తి అయ్యాయి.
అలాగే 5 పంపులతో16.01 టీఎంసీ సామర్థ్యంతో కరివెన పూర్తి కావడంతో పాటుగా పూర్తి అయిన పంపు హౌజ్ లన్నింటిలో భారీ సర్జ్ పూల్ నిర్మాణాలు పూర్తి చేశారు. సంబంధింత పంపు హౌజ్‌లకు అనుసంధానంగా జలాశయాల నిర్మాణాల పనులు మధ్యలోనే నిలిచి పోయాయి.
పెండింగ్ లో టన్నెల్ పనులు
90 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు హెడ్ వర్క్‌లు దాదాపుగా పూర్తి అయినప్పటికీ ఎత్తిపోతల అనంతరం నీటిప్రవాహం గమ్య స్థానానికి చేరేందుకు నిర్మించాల్సిన టన్నెల్ పనులు ప్రారంభం కాలేదు. దట్టమైన నల్లమల అడవుల మధ్యలోంచి భూగర్భం నుంచి కాలువలు తవ్వాల్సి ఉంది.
ఈ టన్నెల్‌లు నిర్మించినప్పుడు వచ్చే మట్టి రాళ్లతో పర్యావరణానికి నష్టం వాటిల్లుతోందని ఏపీ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు నమోదు చేయగా నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ సిబ్బంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో పాటుగా ప్రత్యామ్నాయ అంశాలను పరిశీలించి సూచనప్రాయంగా అనుమతి ఇచ్చింది.
త్వరలో పూర్తి స్థాయి అనుమతి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉపరితల కాలువల నిర్మాణాలతో పాటుగా నార్లాపూర్ పంపు హౌజ్ నుంచి 15 కిలో మీటర్లు, ఎదుల నుంచి 19 కిలో మీటర్లు, వట్టేం నుంచి ఉపరితల కాలువలు, ఉద్దండా పూర్ నుంచి 10 కిలో మీటర్లు, లక్ష్మీ దేవి పల్లి నుంచి 14 కిలో మీటర్ల టన్నెల్స్ నిర్మించాల్సిఉంది.
ఈ టన్నెల్స్ డీ ఆకారంలో 12 మీటర్ల ఎత్తు, 9 మీటర్ల వెడల్పు లో నిర్మించనున్నారు. టన్నెల్ నిర్మాణాల కోసం గజ ఇంజనీరింగ్, జేపీ టన్నెల్ ఇంజనీరింగ్, నవయుగ కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయి. ప్రధాన టన్నెల్ కు అనుసంధానంగా మరిన్ని టన్నెల్స్ నిర్మించాల్సి ఉంటుంది.
మొత్తంగా భూగర్భం నుంచి 130 కిలో మీటర్ల భారీ టన్నెల్స్ నిర్మాణాలతో పాటుగా పంటకాలువలు నిర్మిస్తేనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు దాదాపుగా పూర్తి అవుతాయి. ఇప్పటివరకు కేవలం పంపు హౌజ్ లు మాత్రం నిర్మించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండానే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది.
బిల్లుల చెల్లింపులు… పెరిగిన అంచనా వ్యయం
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించిన బిల్లులు పూర్తి స్తాయిలో చెల్లించకుండానే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో సుమారు రూ. 4వేల కోట్లు పెండింగ్ బిల్లులు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పై పడింది. అయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తి చేయాలనే పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కొద్ది నెలల్లోనే దాదాపుగా పెండింగ్ బిల్లులు చెల్లించడంతో ప్రస్తుతం మరో రూ. 2వేల కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది.
అయితే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయి అంచనా వ్యయం రూ. 35వేల 200 కోట్లు కాగా 2015 నుంచి పెరిగిన అంచనా వ్యయంతో పోల్చితే ప్రస్తుతం రూ. 70వేల కోట్ల తో పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు.