న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీ సహా దేశంలోని పలుప్రాంతాల్లో భారీ విధ్వంసాలకు ఖలిస్తానీ ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. నిఘా వర్గాల అప్రమత్తత కారణంగా భారీ ముప్పు తప్పింది. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అందిన సమాచారం ప్రకారం హర్యానా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో కర్నాల్ వద్ద నలుగురు అనుమానిత ఐఎస్ఐ-ఖలిస్తానీ ఉగ్రవాదులు దొరికారు. వారి వద్ద భారీఎత్తున పేలుడు పదార్థాలు, గన్‌పౌడర్‌తో పాటు పాయింట్ 30 క్యాలిబర్ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తే.. విచారణలో విస్మయం కల్గించే విషయాలు బయటపడ్డాయి.
పాకిస్తాన్ నుంచి డ్రోన్ల సాయంతో పేలుడు పదార్థాలను భారత్‌కు చేరుస్తున్నట్టు విచారణలో తేలింది. పంజాబ్ సరిహద్దుల్లో ఆ పేలుడు పదార్థాలను అందుకుని, అక్కణ్ణుంచి హర్యానా మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్, ఆ తర్వాత తెలంగాణలోని ఆదిలాబాద్‌కు తరలించాలన్నది ఉగ్రవాదుల కుట్రగా తెలిసింది. అయితే ఖలిస్తానీ ఉగ్రవాదుల కదలికలపై నిరంతరం నిఘాపెట్టిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ కుట్రను ముందుగానే పసిగట్టి తెలంగాణ, పంజాబ్, హర్యానా పోలీసు యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున గం. 4.00 సమయంలో బస్తార టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో అటుగా వచ్చిన ఓ ఇన్నోవాలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించేసరికి, వారిని కిందికి దించి ఆ వాహనాన్ని తనిఖీ చేశారు. అప్పటికే సిద్ధం చేసి పెట్టుకున్న 3 ఐఈడీ బాంబులతో పాటు ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న నలుగురినీ అరెస్టు చేసిన పోలీసులు, వారిని గుర్‌ప్రీత్, పర్మీందర్, అమన్‌దీప్, భూపేంద్రగా గుర్తించారు. ఈ నలుగురు ఫిరోజ్‌పూర్ నుంచి నాందేడ్‌కు పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్నట్లు తేల్చారు. నలుగురికీ ఖలీస్తాన్ ఉగ్రవాది బబ్బర్ ఖల్సాతో సంబంధాలున్నట్టు విచారణలో వెల్లడైంది.
నలుగురు నిందితులు పాకిస్తాన్‌లోని ఓ వ్యక్తి నుంచి అందుకుంటున్న ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్టు కర్నాల్ ఎస్పీ వెల్లడించారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌కు బాంబులను చేరవేయాల్సిందిగా పాకిస్తాన్ నుంచి ఈ నలుగురికీ ఆదేశాలు అందాయని, పాకిస్తాన్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు చేరాయని, వాటిని ఈ నలుగురు తీసుకొని, ఇన్నోవా వాహనంలో మహారాష్ట్రలోని నాందేడ్‌కు తరలిస్తున్నారని తెలిపారు. అక్కణ్ణుంచి ఆదిలాబాద్‌లోని ఓ ప్రాంతానికి చేరవేయాలని అనుకున్నారని, కానీ ఈలోగా పోలీసుల తనిఖీల్లో దొరికిపోయారని వెల్లడించారు.
తెలంగాణ వరకు ఖలిస్తానీ లింకులు?
నిఘా వర్గాల అప్రమత్తతతో బయటపడ్డ ఈ ఉగ్ర కుట్ర లింకులు తెలంగాణ వరకు విస్తరించినట్టు స్పష్టమైంది. పాకిస్తాన్ నుంచి పంజాబ్, హర్యానా మీదుగా తెలంగాణ వరకు పేలుడు పదార్థాలను తరలించే ప్రయత్నం విఫలమైంది. అయితే తెలంగాణలోని ఆదిలాబాద్‌ను ఖలిస్తానీ ఉగ్రవాదులు ఎందుకు వేదికగా చేసుకున్నారన్నది అంతుచిక్కడం లేదు. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్‌ను వేరు చేసినందుకు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, భారత్ వినాశనమే లక్ష్యంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పంజాబ్‌ను భారత్ నుంచి వేరుచేయడం కోసం ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తోంది. భారతదేశం ఆ వేర్పాటువాదాన్ని విజయవంతంగా తిప్పికొట్టింది. అయితే ఈ మధ్యకాలంలో ఢిల్లీ నగరాన్ని చుట్టుముట్టి రైతులు సాగించిన ఉద్యమం సమయంలో ఖలిస్తానీ వేర్పాటువాదం మరోసారి వేళ్లూనుకుంది. పాకిస్తాన్ ఈ వేర్పాటువాదాన్ని ప్రేరేపిస్తూ భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఖలిస్తానీ ఉగ్రవాదులకు అవసరమైన మారణాయుధాలు, పేలుడు పదార్థాలను సమకూర్చుతూ విధ్వంసాలకు పథక రచన చేస్తోంది.
అయితే పంజాబ్, ఆ చుట్టుపక్కల రాష్ట్రాల వరకే పరిమితమైన ఖలిస్తానీ వేర్పాటువాదం దక్షిణాదిలో, అందులోనూ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ వరకు విస్తరించడమే నిఘావర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదానికి దక్షిణాది రాష్ట్రాల నుంచి సహకారం అందించడం కొత్తేమీ కాదు. అయితే ఖలిస్తానీ శక్తులు సైతం దక్షిణాదిని అడ్డాగా మార్చుకుంటున్నారా అన్న అనుమానాలు ప్రస్తుతం భద్రతా బలగాలను, పోలీసు యంత్రాగాన్ని వేధిస్తున్నాయి. దక్షిణాదిలో సిక్కులకు పవిత్రస్థలంగా ఉన్న నాందేడ్‌ను కూడా తమ జాబితాలో చేర్చుకోవడం ఆందోళన కల్గిస్తోంది.