Saturday, November 23, 2024

భారత్‌ చేతిలో పాక్‌ చిత్తు.. ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ సెమీస్‌కు అర్హత


ఆసియా పురుషుల హాకీ ఛాంపియన్స్‌ టోర్నీలో దాయాది పాక్‌పై భారత్‌ ఘనవిజయం సాధించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 3-1తేడాతో గెలిచి సెమీఫైనల్స్‌కు చేరుకుంది. బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా వేదికగా జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత్‌ ఆధిపత్యం కొనసాగుతుంది. మన్‌ప్రీత్‌సేన వరుసగా రెండోసారి జయభేరి మోగించింది. వైస్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌సింగ్‌ విజృంభించడంతో భారత్‌ 3-1తేడాతో పాక్‌ను ఓడించి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం ఢాకాలో జరిగిన మ్యాచ్‌లో పాక్‌పై గెలిచిన భారత్‌ సెమీస్‌కు అర్హత సాధించింది. హర్మన్‌ప్రీత్‌ 8వ నిమిషంలో అనంతరం 53వ నిమిషంలో రెండు పెనాల్టిd కార్నర్‌లను గోల్స్‌గా మార్చి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆకాశ్‌దీప్‌సింగ్‌ కూడా 42వ నిమిషంలో గోల్‌ చేయడంతో భారత్‌ ఖాతాలో మూడు గోల్స్‌ నమోదయ్యాయి. పాక్‌ ఆటగాడు జునైద్‌ మంజూర్‌ 45వ నిమిషంలో పాకిస్థాన్‌ తరఫున ఏకైక గోల్‌ నమోదు చేశాడు. దీంతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ మరో ఛాంపియన్‌ పాక్‌పై విజయాన్ని నమోదు చేసింది. మరోవైపు పాకిస్థాన్‌ తమ ప్రారంభ మ్యాచ్‌లో జపాన్‌పై ఆడి డ్రా చేసుకుంది.

భారత్‌ కూడా తన ఆరంభమ్యాచ్‌లో 2-2తో డ్రా చేసుకుంది. మన్‌ప్రీత్‌సేన ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 7పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఐదు జట్లు తలపడుతున్న ఈ టోర్నీలో ఆదివారం తన చివరి రౌండ్‌ రాబిన్‌ మ్యాచ్‌లో భారత్‌ జపాన్‌తో తలపడనుంది. కాగా 2018లో మస్కట్‌ వేదికగా జరిగిన ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. దీంతో భారత్‌, పాక్‌ ట్రోఫీని సంయుక్తంగా పంచుకున్నాయి. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇరుజట్లు డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ హోదాలో బరిలో దిగాయి. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత భారత హాకీ జట్టు ఆడుతున్న టోర్నీ ఇదే..ఈ టోర్నీలో కెప్టెన్‌ మన్‌ప్రీత్‌సింగ్‌ సారథ్యంలోని భారతజట్టుకు ఇది మూడో మ్యాచ్‌. దక్షిణ కొరియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌, కొరియా చెరో రెండు గోల్స్‌ సాధించడంతో ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. అనంతరం రెండో మ్యాచ్‌ ఆతిథ్య బంగ్లాదేశ్‌ జట్టుపై భారత్‌ 9-0తేడాతో ఘనవిజయం సాధించింది. ఈక్రమంలో శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను 3-1తేడాతో ఓడించి సెమీస్‌కు అర్హత సాధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement