కాంగ్రెస్ గెలుపు కోసం పాక్ ఆరాటం
గుజరాత్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ ఆరోపణ
కాంగ్రెస్ హాయంలోనే బ్యాంకులు లూఠీ
రాజ్యాంగాన్ని సైతం రెండుగా చేసిన పార్టీ అది
360 ఆర్టికల్ ను రద్దు చేసి ఒకే రాజ్యాంగాన్ని తెచ్చానన్న మోదీ
ఆనంద్ నగర్ – గుజరాత్ – గత 60 ఏళ్లుగా బ్యాంకులను కాంగ్రెస్ కబ్జా చేసిందని ఆరోపించారు ప్రధాని మోదీ. గుజరాత్‌లోని ఆనంద్ నగర్ లో నేడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ, ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వం బ్యాంకులుగా మార్చి 60 ఏళ్లుగా కాంగ్రెస్ నేతలు దోచుకున్నారంటూ మండి పడ్డారు. తాను రాకముందు ఈ దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు ఉండేవారన్నారు. కాశ్మీర్‌లో భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ అనుమతించలేదని, .. ఆర్టికల్ 370 గోడలా కూర్చుందన్నారు. సర్దార్ పటేల్ భూమి నుంచి వచ్చిన తాను అడ్డుగోడలా ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేశానని చెప్పుకొచ్చారు. ఇక, కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి, భారత రాజ్యాంగాన్ని అమలు చేశానని చెప్పారు.
కాగా, ఒకప్పుడు ఉగ్రవాదులను ఎగుమతి చేసిన దేశం (పాకిస్థాన్) ఇప్పుడు పిండిని దిగుమతి చేసుకోవడానికి ఇంటింటికీ తిరుగుతోందన్నారు. అలాగే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేసిన ప్రధాని నేడు భారతదేశంలో కాంగ్రెస్ బలహీనపడుతోందన్నారు. తమాషా ఏమిటంటే ఇక్కడ కాంగ్రెస్ చచ్చిపోతోందని.. అక్కడ పాకిస్థాన్ ఏడుస్తోందని అన్నారు. . ఇప్పుడు పాక్ నేతలు కాంగ్రెస్ కోసం ప్రార్థించాలి అని ఆయన చెప్పుకొచ్చారు. యువరాజు (రాహుల్ గాంధీ)ను ప్రధానమంత్రిని చేసేందుకు పాక్ ఉవ్విళ్లూరుతోందంటూ ఆరోపించారు. పాకిస్థాన్‌కు కాంగ్రెస్‌కు మధ్య ఉన్న ఈ భాగస్వామ్యం ఇప్పుడు పూర్తిగా బట్టబయలైంది అని ప్రధాన మంత్రి వెల్లడించారు.