Thursday, November 7, 2024

అమెరికా ఇంటెలిజెన్స్ లో పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ.. ఇద్దరు ఏజెంట్ల గుర్తింపు

అగ్రరాజ్యం అమెరికా ఇంటెలిజెన్స్‌ విభాగంలో చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్‌కు చెందిన ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్‌ఐ) వ్యూహాన్ని అమెరికా తిప్పికొట్టింది. ఐఎస్‌ఐ ఆదేశాల మేరకు పని చేస్తున్న ఇద్దరిని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత కొన్ని నెలల నుంచి నిందితులు నకిలీ గుర్తింపు కార్డులతో ఎఫ్‌బీఐ అధికారులుగా చెలామణి అవుతున్నట్టు గుర్తించారు. జో బైడెన్‌ భార్య జిల్‌ బైడెన్‌ భద్రతా విభాగంలోకి చొరబడేందుకు వీరు ప్రయత్నించినట్టు సమాచారం. ఐఎస్‌ఐతో కలిసి పని చేస్తున్న అరియన్‌ తాహిర్‌జాదే (40), హైదర్‌ అలీ (35)లు డిపార్ట్‌మెంట్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) యూనిట్‌లో పని చేస్తున్నట్టు నకిలీ గుర్తింపు కార్డులను సృష్టించారు.

అండర్‌ కవర్‌ అంటూ బుకాయింపు
2021 జనవరిలో జరిగిన క్యాపిటల్‌ హిల్‌ అల్లర్ల కేసులో అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ చేస్తున్నట్టు నమ్మించారు. ఈ క్రమంలో ఫెడరల్‌ లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌, రక్షణ విభాగానికి చెందిన పలువురితో పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నించారు. వాషింగ్టన్‌లోని ఎఫ్‌బీఐ, డీహెచ్‌ఎస్‌, యూనైటెడక్ష స్టేట్స్‌ సీక్రెట్‌ సర్వీస్‌ (యూఎస్‌ఎస్‌ఎస్‌) సిబ్బంది నివాసం ఉండే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తేలింది. నిఘా పరికరాలు, డ్రోన్లు, అత్యాధునిక స్క్రీన్‌ ఉన్న టీవీ, ఐఫోన్లు వంటి ఖరీదైన బహుమతులు ఇచ్చి తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ఇద్దరితో సంబంధం ఉన్న నలుగురు సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లను సెలవులపై పంపారు. అలీ నుంచి పాక్‌, ఇరాన్‌ వీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఇస్తాంబుల్‌, దోహాకి వెళ్లినట్టు తేలింది. ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నట్టు అంగీకరించినట్టు సమాచారం. జిల్‌ బైడెన్‌ సెక్యూరిటీ విభాగంలో పని చేసే ఓ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్‌కు ఖరీదైన కానుక ఇచ్చినట్టు తెలుస్తున్నది. 2000 డాలర్లు విలువ చేసే విలువైన అసాల్ట్‌ రైఫిల్‌ను ఇచ్చినట్టు సమాచారం. తదుపరి విచారణ వరకు వారిని కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement