ఈ ఏడాది జరిగే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ల విషయంలో భారత్ – పాకిస్తాన్ దేశాల క్రికెట్ బోర్డుల మధ్య కొంతకాలంగా మాటల దాడి నడుస్తోంది. సెప్టెంబర్ జరిగే ఆసియా కప్ టోర్నీ ఆతిథ్యం హక్కులు పాకిస్తాన్ దక్కించుకోగా, అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆసియా కప్ కోసం పాక్ వెళ్లేందుకు బీసీసీఐ ససేమిరా అంటోంది. ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ జట్టును ఇండియా పంపే విషయంలో బీసీసీఐకి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఓ షరతు పెట్టింది. 2025లో తమ దేశంలో జరిగే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాల్గొంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని పీసీబీ చైర్మన్ నజామ్ సేథి అంటున్నారు. అప్పుడే తమ జట్టును ఇండియా పంపిస్తామని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.
మరోవైపు పాక్ ఆతిథ్యం ఇచ్చే ఆసియా కప్‌లో టీమిండియా మ్యాచ్‌లను యూఏఈలో ఆడించాలన్న ‘హైబ్రిడ్ మోడల్’కు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు అయిన జై షా ఇంకా ఆమోదం తెలుపలేదు. ఈ టోర్నీ మొత్తాన్ని తటస్థ వేదికపైనే నిర్వహించాలని బీసీసీఐ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా కప్‌తో పాటు 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ విషయంలో సేథి ఏసీసీ, ఐసీసీ అధికారులపై ఒత్తిడి తేవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌లో ఆసియా కప్ టోర్నమెంట్ మ్యాచ్‌లు లేకుంటే, ఆ టోర్నీలో పాక్ జట్టు ఆడబోదని వారికి స్పష్టం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అదే సమయంలో 2025 చాంపియన్స్ ట్రోఫీకి అయినా టీమిండియా పాక్‌కు వస్తుందని హామీ ఇవ్వాలని ఆయన పట్టుబడుతున్నారని చెప్పాయి.