న్యూయార్క్: భారత్‌లో స్వేచ్ఛ, సామాజిక, రాజకీయ పరిస్థితుల గురించి ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ కీలక వ్యాఖ్యలు చేశారు. దాయాది దేశమైన పాకిస్తాన్‌తో ఇక్కడి పరిస్థితులను విశ్లేషించారు. ఆయన వ్యక్తంచేసిన అభిప్రాయాలు సంచలనం రేకెత్తించాయి. మొత్తంగా దక్షిణాసియాలో స్వేచ్ఛ గురించి చెప్పాల్సి వస్తే, వ్యక్తిగత స్వేచ్ఛ కంటే సమూహ స్వేచ్ఛకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. అమెరికాలోని బ్రౌన్ యూనివర్శిటీ కాంటెంపరరీ సౌత్ ఆసియా సెంటర్లో ఇటీవల జరిగిన ఓపీ జిందాల్ సెమినార్లో ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ”రాజకీయం, మతం, సాహిత్యం: భారత్ – పాకిస్తాన్” అనే అంశంపై ప్యానెల్లో పాల్గొన్నారు.
కొలంబియా విశవిద్యాలయం ప్రొఫెసర్ గౌరీ విశనాథన్ సాహిత్య చర్చను నడపించారు. మతపరమైన చర్చను ఇస్లామిక్ హ్యుమానిటీస్ అండ్ హిస్టరీ (బ్రౌన్) ప్రొఫెసర్ షాజాద్ బషీర్ చేపట్టగా, ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ ది సోషల్ సైన్సెస్ అండ్ పొలిటికల్ సైన్స్ (బ్రౌన్) ప్రొఫెసర్ అశుతోష్ వర్ష్నీ రాజకీయ చర్చను సెమినార్లో చేపట్టారు. పాక్, భారత్ గురించి రష్దీ తన అభిప్రాయాలను ఈ సందర్భంగా వెల్లడించారు. మతం, స్వేచ్ఛ విషయాల్లో ఇటీవల పాకిస్తాన్ ర్యాంకింగ్ భారత్ కంటే మెరుగ వడాన్ని విశ్లేషిస్తూ, పాక్ పరిణితి చెందింది అనే కంటే భారత్ దిగజారింది అనడమే సబబని అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛ వాదనల గురించి పాశ్చాత్య దేశాల నుండి చాలా నేర్చుకున్నాను.
దురదృష్టవశాత్తు, దక్షిణ ఆసియాలో, స్వేచ్ఛ విషయంలో సమూహం ప్రాముఖ్యత అత్యున్నతమైనదిగా పరిగణించ బడుతుంది. ఇక్కడ వ్యక్తికి అభిమతానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. పాకిస్తాన్ తగినంతగా ఎదగలేదన్న విషయం బంగ్లాదేశ్ ఏర్పాటు ద్వారా గతంలో నిరూపితమైంది. కేవలం మతపరమైన గుర్తింపు ఆధారంగా ఏ దేశమూ మనుగడ సాగించలేదు. పాకిస్తాన్ కంటే ఎన్నోరెట్లు మెరుగైన పరిస్థితులు భారత్‌కు ఉన్నాయని నేను అనుకునేవాడిని. కానీ నా నమ్మకం ఎంతోకాలం నిలబడలేదు. అంటే పాకిస్తాన్ అభివృద్ధి చెందిందని చెప్పడం లేదు. కానీ భారత్ దిగజారడమే నా విశ్వాసం సడలడానికి కారణమైంది అని రష్దీ వివరించారు.
తాలిబన్లతో పాక్ డేంజర్ గేమ్..
పాకిస్తాన్‌కు ఇప్పటికీ సమస్యలు ఉన్నాయి. ఇక్కడ స్పష్టమైన ప్రజాస్వామ్య నిర్మాణం లేదు. పైగా వాస్తవికంగా చూస్తే ఆర్మీ చేతిలో కీలుబొమ్మగా ఉంటుంది. మత సంస్థలకు ఎక్కువ అధికారం ఉంటుంది. ఇవన్నీ ఆ దేశానికి సమస్యలే. ఇవి చాలవన్నట్లు ఇటీవల తాలిబన్లకు సురక్షితమైన ఆశ్రయం కల్పించడం ద్వారా ప్రమాదకరమైన ఆటను మొదలుపెట్టింది. ఇదంతా భారత్‌ను దృష్టిలో ఉంచుకునే చేసింది. పశ్చిమ సరిహద్దులో భారత్, తూర్పు సరిహద్దులో భారత్ మిత్రదేశాన్ని చూసి పాక్ భయపడింది. కానీ వాస్తవం ఏమిటంటే పాకిస్తాన్‌ను స్వాధీనం చేసుకోవాలని తాలిబన్లు భావిస్తున్నారు. అఎn్గానిస్తాన్‌లో భారీ సమస్యలున్నాయి. తాలిబన్లకు అఎn్గాన్ కంటే పెద్ద దేశమైన పాకిస్తానే విలువైనది.
పాకిస్థాన్ దారిలో భారత్ వెళ్తున్నదా?
ఈ ప్రశ్నకు ఇప్పుడే స్పష్టమైన సమాధానం చెప్పలేము. మతపరమైన దేశంగా వెళ్తోందని నిర్ధారణకు రాలేము. ఇది ఇంకా నిర్దిష్ట రూపం దాల్చలేదు. అయితే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం స్థితిని వివిధ అంతర్జాతీయ సంస్థలు తగ్గించడం విషాదకరం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గొప్పగా గరించదగినది భారతదేశం. ప్రజాసామ్యంగా ఉండటం ధనిక దేశాలకు చాలా సులభం. అదే సమయంలో ప్రజాస్వామ్య స్వేచ్ఛను కాపాడుకోవడం పేద దేశాలకు చాలా కష్టం. ప్రజాస్వామ్య విరుద్ధమైన హిందూ మెజారిటీ పాలన ఆలోచనను చాలా మంది భారతీయులకు నరేంద్ర మోడీ విక్రయించగలిగారన్నది నిజంగా విషాదకరం అని రష్దీ విశ్లేషించారు.