చిరకాల మిత్ర దేశం చైనా సాయంతో కరోనా కట్టడికి స్వదేశీ టీకాను పాక్ వ్యాక్‌ను (PakVac) అభివృద్ధి చేసినట్లు పాకిస్థాన్ తెలిపింది. మంగళవారం దీన్ని ఇస్లామాబాద్‌లో విడుదల చేసింది. తాము ఎదుర్కొంటున్న కఠినమైన సవాళ్లను మిత్ర దేశాల సహకారంతో అధిగమించడమేగాక, వీటిని అవకాశాలుగా మల్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పాకిస్థాన్ ఆరోగ్య శాఖ ప్రత్యేక సహాయాధికారి డా.పైజల్ సుల్తాన్ తెలిపారు.
పాక్ వ్యాక్ వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను చైనా సమకూర్చిందని, అయినా దీన్ని అభివృద్ధి చేయడం అంత సలభం కాదని డా.పైజల్ చెప్పారు. చైనా తమకు అత్యంత సన్నిహిత భాగస్వామ్య దేశమని తెలిపారు. త్వరలో ఈ టీకా ఉత్పత్తిని భారీ స్థాయిలో ప్రారంభిస్తామన్నారు.పాకిస్థాన్‌లో కరోనా ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. పాజిటివిటీ రేటు 4 శాతం దిగువకు పడిపోయింది. కొత్త కేసుల సంఖ్య (1,771) మూడు నెలల కనిష్ఠానికి తగ్గింది. ఆ దేశంలో ఇప్పటివరకు 9,22,824 మందికి వైరస్ సోకింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొత్తం 73లక్షల టీకా డోసులను పంపిణీ చేశారు. దాదాపు 20 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది