ఇస్లామాబాద్ – పాకిస్తాన్‌లో భారీ ఉగ్రదాడి జరిగింది. పాకిస్తాన్ ఆర్మీ బేస్ వద్ద మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 23 మంది మరణించారు. మరో 27 మందికి పైగా గాయపడ్డారు.. ఈ దాడిని పాకిస్తాన్ తాలిబాన్‌కి అనుబంధంగా ఉన్న ఉగ్రవాదులు జరిపినట్లుగా అధికారులు తెలుపుతున్నారు. ఆఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉన్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని సైనిక స్థావరంపై తెల్లవారుజామున ఈ దాడి జరిగింది. అయితే దాడి జరిగిన సమయంలో సైనికులతో పాటు ఇతరులు నిద్రలో ఉన్నారు.. మరణించిన వారిలో చాలా మంది సివిల్ డ్రెస్సుల్లో ఉన్నారు.
ఓ పాఠశాల భవనాన్ని తాత్కాలిక సైనిక స్థావరంగా మార్చుకున్నారు. ఈ భవనం వద్దే ఆత్మాహుతి వాహనం పేలింది. మరో 27 మంది గాయపడినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి భవనం కూలిపోయింది. మృతదేహాలను శిథిలాల కింద నుంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు..