ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ లో భాగంగా ఇవ్వాల బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టును వర్షం ఆదుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అవ్వడంతో.. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 21 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో, వన్డే ప్రపంచకప్‌లో ఎక్కడో మిణుకుమిణుకు మంటున్న సెమీస్ ఆశలను పాకిస్థాన్ సజీవంగా ఉంచుకుంది.
401 పరుగుల భారీ లక్ష్యంతో పాకిస్థాన్ బరిలోకి దిగింది. అయితే.. పాక్ ఇన్నింగ్స్‌లో 21.3వ ఓవర్ పూర్తి అయ్యే సరికి వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ఆగిపోయింది. ఆ సమయానికి పాకిస్థాన్ వికెట్ నష్టపోయి 160 పరుగులు చేసింది. కాసేపటి తరువాత మ్యాచ్ ప్రారంభం కాగా.. పాకిస్థాన్ లక్ష్యాన్ని 41 ఓవర్లలో 342కు కుదించారు. మళ్లీ మ్యాచ్ ప్రారంభమైనా ఎక్కువ సేపు ఆట సాగలేదు. మరోసారి 25.3 ఓవర్ల ఆట పూర్తికాగానే మరోసారి వర్షం మొదలైంది.
అప్పటికి పాకిస్థాన్ వికెట్ నష్టపోయి 200 పరుగులు చేసింది. ఎంతసేపటికి వర్షం తగ్గలేదు. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆ సమాయానికి చేయాల్సిన పరుగుల కన్నా మరో 21 పరుగులు అదనంగా చేసి ఉండడంతో పాకిస్థాన్ ను విజేతగా ప్రకటించారు. పాకిస్థాన్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్ (126 నాటౌట్) మెరుపు శతకంతో ఆకట్టుకున్నాడు. బాబర్ ఆజాం (63 నాటౌట్) రాణించారు.
ఇక, అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర సెంచరీ (108)తో చెలరేగాడు. కేన్ విలియమ్సన్ (95) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్ 41, మార్క్ చాప్మన్ 39, డేవాన్ కాన్వే 35, డారిల్ మిచెల్ 29 పరుగులు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో మహ్మద్ వాసిం జూనియర్ మూడు వికెట్లు పడగొట్టాడు. హసన్ అలీ, హరీస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్ తలా ఓ వికెట్ సాధించారు. కాగా.. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో న్యూజిలాండ్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి.