Tuesday, November 26, 2024

PAK vs ENG | నాలుగున్నరేళ్ళ తర్వాత పాక్‌కు తొలి విజయం

ఎట్టకేలకు స్వదేశంలో పాకిస్థాన్ జట్టు విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో… తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో ఓడిన పాక్… రెండో టెస్టులో ఘ‌న విజయం సాధించింది. ఈరోజు (శుక్ర‌వారం) ముగిసిన రెండో టెస్టులో ఇంగ్లండ్ పై పాక్ 152 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 366 పరుగులు చేసింది. యువ ఆటగాడు కమ్రాన్ గులామ్ (118) సెంచరీతో చెలరేగగా.. సయీమ్ అయూబ్ (77) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్ (4/114), బ్రైడన్ కార్స్ (3/50) వికెట్లు తీయగా… మాథ్యూ పాట్స్ రెండు వికెట్లు, షోయబ్ బషీర్ ఒక వికెట్ తీశారు.

- Advertisement -

అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 291 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (114) ఒంటరి సెంచరీతో రాణించాడు. పాక్ బౌలర్లలో సాజిద్ ఖాన్ (7/111), నోమన్ అలీ (3/101) మూడు వికెట్లు తీశారు.

75 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాక్… 221 పరుగులు చేసింది. సల్మాన్ అఘా (63) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ (4/66), జాక్ లీచ్ (3/67), బ్రేడన్ కార్స్ (2/29) రెండేసి వికెట్లు తీశారు.

ఇక‌, 297 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు పాక్ బౌలర్లు నోమన్ అలీ (8/46), సాజిద్ ఖాన్ (2/93) చుక్కలు చూపించారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే కుప్పకూలింది. దీంతో పాకిస్థాన్ జ‌ట్టు 152 ప‌రుగుల తేడాతో రెండో మ్యాచ్ ను సొంతం చేసుకుంది.

సంక్షిప్త స్కోర్లు:

పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్: 366 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 291 ఆలౌట్
పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్: 221 ఆలౌట్
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 144 ఆలౌట్

1,350 రోజుల నిరీక్ష‌ణ‌కు తెర..

పాక్‌కు సొంత గ‌డ్డ‌పై విజ‌యం ద‌క్కి 1,350 రోజులు అవుతోంది. చివ‌రిసారిగా 2021లో సౌతాఫ్రికాపై పాక్ టెస్టులో విక్ట‌రీ న‌మోదు చేసింది. ఆ త‌ర్వాత ఒక్క‌సారి కూడా విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇప్పుడు ఇంగ్లండ్‌పై విజ‌యంతో ఆ సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెరదించిన‌ట్లైంది. అలాగే స్వ‌దేశంలో వ‌రుస‌గా 11 ప‌రాజ‌యాల ప‌రంప‌ర‌కు కూడా ముగింపు ప‌లికింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement