పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ టాప్ కమాండర్ తాలిబ్ హుస్సేన్ గుజ్జర్ భద్రతా బలగాలకు చిక్కాడు. జమ్మూకశ్మీర్‌లోని కిష్టావర్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నట్టు బలగాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో గుజ్జర్ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్టు పక్కా సమాచారం అందుకున్న బలగాలు 17 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (CRPF) కలిసి గాలింపు చర్యలు చేపట్టాయి. గుజ్జర్ స్థావరాలపై దాడులు చేసి అతడిని సజీవంగా పట్టుకున్నాయి.
ఇక.. అతడిని సజీవంగా పట్టుకోగలిగామని, ఇది నిజంగా గొప్ప విజయమని భద్రతా బలగాలు పేర్కొన్నాయి. ఉగ్రవాది జహంగిర్ సరూరి అలియాస్ మొహమ్మద్ అమీన్ భట్‌కు గుజ్జర్ అత్యంత సన్నిహితుడు. ఈ నేపథ్యంలో అతడి నుంచి కీలక సమాచారం రాబట్టే చాన్స్ ఉందని తెలుస్తోంది. కాగా, భట్, గుజ్జర్ ఇద్దరూ కొన్ని సంవత్సరాలపాటు కలిసే ఉన్నారు. లోయలో పలు ఉగ్రదాడులకు పాల్పడిన గుజ్జర్ కోసం కొన్నేళ్లగా గాలిస్తున్న బలగాలు ఎట్టకేలకు నిన్న అతడిని సజీవంగా పట్టుకోగలిగాయి.