టీ20 వరల్డ్‌కప్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్‌లో జరగబోయే మ్యాచ్‌తోనే వరల్డ్‌కప్ సమరానికి తెరలేవనుంది. ఈ నేపథ్యంలో పాక్ మాజీ ఆటగాళ్లు అప్పుడే మాటల యుద్ధానికి తెర తీశారు. టీమిండియాను పాక్ మాజీ ఆల్‌రౌండర్ అబ్దుల్ రజాక్ మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశాడు. పాక్ టీమ్‌లో ఉన్న టాలెంట్‌ను చూస్తే.. ఇండియన్ టీమ్ కనీస పోటీ కూడా ఇవ్వలేదని అతను అనడం గమనార్హం.
‘పాకిస్థాన్‌తో ఇండియా పోటీ పడుతుందని అనుకోవడం లేదు. పాకిస్థాన్‌లో ఉన్న టాలెంట్ చాలా భిన్నమైనది. ఇలాంటి సమయంలో ఇండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు లేకపోవడం క్రికెట్‌కు మంచిది కాదు. దాయాదుల మ్యాచ్ ఆసక్తిగా ఉండేది. ప్లేయర్స్ ఎంత ఒత్తిడి తట్టుకునే వాళ్లో తేలిపోయేది. అది ఇప్పుడు మిస్ అవుతున్నాం. రెండు టీమ్స్ మధ్య మ్యాచ్‌లు జరిగి ఉంటే.. పాకిస్థాన్‌లో ఎంత టాలెంట్ ఉందో, అది ఇండియాలో ఎందుకు లేదో తెలిసేది’ అని రజాక్ అన్నాడు. ఇక కపిల్ దేవ్ కంటే కూడా ఇమ్రాన్ ఖానే గొప్ప ప్లేయర్ అనీ అతడు అన్నాడు. వసీం అక్రమ్‌లాంటి ప్లేయర్ అయితే ఇప్పటి వరకూ ఇండియాలో లేడని రజాక్ అభిప్రాయపడ్డాడు.