న్యూ ఢిల్లీ – గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అవార్డు ల ప్రధానోత్సవం బుధవారం రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది .రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను అందజేశారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి త్రిదండి చినజీయర్ స్వామి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. ఇటీవల ఆస్కార్ అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పద్మశ్రీ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతులమీదుగా అందుకున్నారు. కీరవాణి వెంట ఈ వేడుకకు ఆయన సోదరుడు, ప్రముఖ దర్శకుడు రాజమౌళి, ఆయన సతీమణి రమ, కీరవాణి సతీమణి శ్రీవల్లీ, కుమారుడు కాలభైరవ తదితరులు హాజరయ్యారు.
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్‌కు మరణానంతరం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డును ఆయన తనయుడు అఖిలేష్ యాదవ్ స్వీకరించారు. ఆధ్యాత్మిక రంగంలో అందించిన సేవలకు గాను చిన్నజీయర్ స్వామికి పద్మభూషణ్ అవార్డు అందించారు. సామాజిక సేవలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు.సైన్స్ ఇంజినీరింగ్ విభాగంలో మిల్లెట్ మ్యాన్ ఖాదర్వలీ, కళారంగంలో సేవలకు గాను సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, విజ్ఞానరంగంలో ప్రొఫెసర్ నాగప్ప గణేష్, విజ్ఞానరంగంలో అబ్బారెడ్డి రాజేశ్వర్రెడ్డి, కళారంగంలో రవీనా టాండన్ పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు