హైదరాబాద్, ఆంధ్రప్రభ: నేటినుంచి రైతాంగానికి, తెలంగాణ సర్కార్‌కు సరికొత్త సవాలు తీవ్రమవనుంది. కేంద్ర తాత్సారంతో ధాన్యం కొనుగోళ్లపై ఇంకా అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో వరి కోతలు నేటినుంచి ముమ్మరం కానున్నాయి. దీంతో ప్రస్తుత యాసంగి సీజన్‌లో భారీగా ధాన్యం వెల్లువెత్తనున్నదని తెలుస్తోంది. ఈ సీజన్‌లో తెలంగాణ నుంచి 78.85లక్షల టన్నుల దిగుబడి సాకారం అవనున్నదని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వం కొనేది లేదని తేల్చి చెప్పడంతో, రైస్ మిల్లర్లు ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేయరని రైతాంగం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో దిగుబడి పెరిగి కొనుగోలు చేసేవాళ్లు లేక మద్ధతు ధర లభించడం అనుమానంగా కనిపిస్తున్నది. నేటితో ప్రారంభం కానున్న ఏప్రిల్ నెలలో కోతలు తీవ్రం కానున్నాయి. ఉప్పుడు బియ్యాన్ని కేంద్రం కొనుగోలు చేయబోమని తేల్చి చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు ఇంకా తీసుకోలేదు.
ఈ సీజన్లో ప్రత్యామ్నాయ పంటలే వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ వచ్చింది. అయినప్పటికీ రైతాంగం 35.84లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. ఈ నేపథ్యంలో భారీగా పోటెత్తనున్న ధాన్యం నిల్వలతో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గతంలో వలే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయని పక్షంలో ధాన్యం ఇతర ప్రాంతాలకు తరలించేందుకు రైతాంగానికి ఇబ్బందులు ఎదురు కానున్నాయి. మరోవైపు ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తే ధర రాదని, తరుగు పేరుతో దోపిడీ పెరుగుతుందనే అంచనాలున్నాయి. మొత్తం తెలంగాణనుంచి వచ్చే ధాన్యంలో 20లక్షల టన్నులు మిల్లర్లు కొనుగోలు చేసినా , ఇతర అవసరాలకు మరో 15లక్షల టన్నులు పోయినా కనీసంగా 40లక్షల టన్నులను కేంద్రం కొనుగోలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నెల మొదటి వారంలో వెల్లువలా ధాన్యం తరలి రానుంది.
ఇదిలా ఉండగా గత యాసంగి సీజన్‌లో 10.81 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మిల్లర్ల వద్ద పేరుకుపోయాయి. ఇందులో 7.70లక్షల మెట్రిక్ టన్నులు సాధారణ బియ్యంకాగా, మరో 3.11లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం నిల్వలున్నాయి. ఎఫ్‌సీఐకి 6.58 లక్షల మెట్రిక్ టన్నులు, రాష్ట్ర ప్రభుత్వానికి 1.12 మెట్రిక్ టన్నుల సాధారణ బియ్యం ఇవ్వాలి. కానీ
జిల్లాల వారీగా పెండింగ్ ఇలా…
నిజామాబాద్ 3,36,158
కామారెడ్డి 2,92,375
సూర్యాపేట 2,03,817
జగిత్యాల 1,83,914
పెద్దపల్లి 1,82,803
నల్గొండ 1,80,397
మెదక్ 1,72,890
కరీంనగర్ 1,68,029
వరంగల్ 1,40,954
యాదాద్రి 1,40,767
సిరిసిల్ల 1,37,690
వనపర్తి 1,36,938
సిద్దిపేట 1,36,722
కాగా బాయిల్డ్ రైస్ తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం, ముడి బాయ్యం మాత్రమే తీసుకుంటామని కేంద్రం భీస్హించుకు కూర్చోవడంతో తెలంగాణ రైతాంగం దిక్కుతోని పరిస్థితిలో పడిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రంతో కుదుర్చుకున్న డీ సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టంలో తెలంగాణ ఏ విధంగా ముందుకు వెళుతుందన్న ఆశక్తి నెలకొంది. ఈ డీసిపిలో తెలంగాణ ఉంటుందా..బైటికి వస్తుందా అనే అంశంపై ఉత్కంఠ తలెత్తింది. 2012 డిసెంబర్ 13న కేంద్రం ఈ వికేంద్రీకృత సేకరణ వ్యవస్థ అమలులోకి తెచ్చింది. ఈ ఒప్పందం మేరకు కేంద్రం నేరుగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయదు. రాష్ట్ర ప్రభుత్వాలు కనీస మద్ధతు ధర చెల్లించి రైతులనుంచి కొనుగోలు చేయాలి. ఆ ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్‌సీఎంఆర్) కింద మిల్లర్లుకు అప్పగించి…మిల్లింగ్ చేయించి బియ్యాన్ని ఎఫ్‌సిఐకి అందించాలి. ఇందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తుంది. ఈ డీపిసిలో తెలంగాణ, ఏపీతో సహా 23 రాష్ట్రాలు చేరాయి. 15 రాష్ట్రాలనుంచి బియ్యం, 8 రాష్ట్రాలనుంచి గోదుమలను ఎఫ్‌సీఐ సేకరిస్తుంది. రాష్ట్రాలనుంచి తీసుకున్న బియ్యాన్ని కేంద్రం ఆహార భద్రత చట్టం కింద ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా దారిధ్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలకు సబ్సిడీపై సరఫరా చేస్తుంది. ఆహార ధాన్యాల నిల్వలు అధికంగా ఉంటే ఆ రాష్ట్రంనుంచి వాటిని కూడా సెంట్రల్ పూల్ కింద ఎఫ్‌సీఐ కొనుగోలు చేయాలి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..