Monday, November 11, 2024

స్మార్ట్ గ్యాడ్జెట్స్‌తో హెల్త్‌కి పెద్ద దెబ్బ‌.. త‌క్కువ వ‌య‌స్సులోనే ముస‌లిత‌నం ఛాయ‌లు!

ఈ-త‌రం అంతా స్మార్ట్ గ్యాడ్జెట్స్‌పైనే ఆధారప‌డి ప‌నిచేస్తుంటారు. వాకింగ్, ర‌న్నింగ్‌, జిమ్ వంటి ఫిజిక‌ల్ యాక్టివిటీస్‌తో పాటు.. ఇత‌ర సాధార‌ణ ప‌నుల‌లో కూడా ఎన్నో ఎల‌క్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ని వినియోగిస్తున్నారు. అయితే.. ఇదంతా మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకంటే వాటి నుంచి వ‌చ్చే బ్లూ రేస్ (నీలి రంగు కాంతి కిర‌ణాలు) మాన‌వుల ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తున్నాయ‌ని కొన్ని ప‌రిశోధ‌న‌ల ద్వారా తెలుస్తోంది. ప్ర‌ధానంగా కంటి చూపుపై ఎఫెక్ట్ ప‌డ‌డ‌మే కాకుండా బ్లూ రేస్ వ‌ల్ల కొన్ని హార్మోన్స్ కూడా ప్ర‌భావిత‌మై త‌క్కువ వ‌య‌స్సులోనే ముస‌లిత‌నం ఛాయ‌లు క‌నిపిస్తాయ‌ని ఈ మ‌ధ్య జ‌రిపిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డ‌య్యింది.

డిజిట‌ల్ మీడియా, ఆంధ్రప్ర‌భ‌

ప్రస్తుత తరుణంలో అందరూ సాంకేతిక ప‌రికాలు.. స్మార్ట్ గాడ్జెట్‌ల‌తో 24/7 స‌మ‌యం తెలియ‌కుండా గ‌డిపేస్తున్నాం. చేతిలో ఫోన్‌లు, చెవుల్లో ఇయర్‌ఫోన్‌లు, చేతికి స్మార్ట్‌వాచ్‌ ఇట్లా ఎన్నో గాడ్జెట్‌లు రోజూవారి జీవితంలో మ‌నకు తెలియ‌కుండానే ఒక భాగం అయిపోయాయి. ఈ రోజుల్లో స్మార్ట్ గ్యాడ్జెట్స్​ లేని జీవితాన్ని ఊహించడం చాలా కష్టం.. అయితే ఇట్లాంటి ఎల‌క్ట్రానిక్‌ గాడ్జెట్‌ల కార‌ణంగా ఎన్నో ఆరోగ్య స‌మ‌స్య‌లు వస్తున్నాయి. అట్లాంటి వాటిలో ఏజ్ ఇష్యూ కూడా ఒక‌టి. ఇట్లాంటి సాంకేతిక ప‌రిక‌రాలు వేగంగా మ‌న‌ వయస్సును పెంచుతాయని చెబితే న‌మ్ముతారా? అదే నిజం అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. చాలా గాడ్జెట్ ల‌ ఉపయోగం వల్ల కంటి చూపుతో పాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఇవి మన వృద్ధాప్య ప్రక్రియపై కూడా ప్రభావం చూపుతాయ‌ని తాజా అధ్యయనం ఒక‌టి పేర్కొంది. జర్నల్ “ఫ్రాంటియర్స్ ఇన్ ఏజింగ్”లో ప‌బ్లిష్ అయిన ఒక జంతు-నమూనా అధ్యయనం ప్ర‌కారం.. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ వంటి గాడ్జెట్‌ల నుండి వ‌చ్చే “బ్లూ రేస్” వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయ‌ని వెల్ల‌డించారు.

టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫోన్‌ల వంటి రోజువారీ పరికరాల నుండి బ్లూ లైట్ వంటి అధిక కాంతి వ‌ల్ల వల్ల మాన‌వ‌ శరీరంలోని అనేక రకాల కణాలపై హానికరమైన ప్రభావాలు ఉంటాయ‌ని యూఎస్‌లోని ఒరెగాన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన అధ్యయన సహ రచయిత జడ్విగా గిబుల్టోవిచ్ తెలిపారు. ఇది చర్మం, కొవ్వు కణాల నుండి ఇంద్రియ న్యూరాన్ల వరకు ప్ర‌భావం చూపుతుంద‌ని ఆమె చెప్పారు. ఈ విష‌యాల‌ను ఈగ‌లపై జ‌రిపిన ప్ర‌యోగాల ద్వారా క‌నుగొన్నారు. ఈగ‌ల(Fruit Flies)పై నిర్వ‌హించిన ప‌లు ప్ర‌యోగాల్లో బ్లూ రేస్ ఎట్లా కాంతిని వెద‌జ‌ల్ల‌డం ద్వారా వాటి కంటిచూపు, ఆరోగ్యంతోపాటు వ‌య‌స్సు దెబ్బ‌తింటుంద‌నే అంశాల‌ను ఈ ప్ర‌యోగం ద్వారా క‌నుగొన్నారు.

ఇక‌.. నీలి కాంతిని ఎక్కువ వెద‌జ‌ల్ల‌డం ద్వారా మానవులలో కూడా ఒత్తిడిని పెంచే హార్మోన్స్‌పై ప్ర‌భావం చూపుతుంది. ఇట్లా మాన‌వ కణాల పనితీరును దెబ్బ‌తీస్తుంది. దీంతో వేగంగా వృద్ధాప్యం ఛాయ‌లు క‌నిపిస్తాయ‌ని నివేదిక‌లో వెల్ల‌డించారు. గాడ్జెట్ల నుండి వచ్చే బ్లూ రేస్ (నీలి కాంతి) మెలటోనిన్ ఉత్పత్తిని త‌గ్గిస్తాయి. దీంతో నిద్రకు దూరం కావాల్సి వ‌స్తుంది. కాబట్టి, గాడ్జెట్‌ల వాడకాన్ని తగ్గించడంతో త్వ‌ర‌గా నిద్రపోవడానికి ఎక్కువ చాన్సెస్ ఉంటాయ‌ని వైద్య ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డ‌య్యింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement