Saturday, November 23, 2024

పోటెత్తిన అభిమానం, కేసీఆర్‌ను కలవాలన్న ఆత్రం.. బీఆర్ఎస్ ఆఫీసు వద్ద స్వల్ప తోపులాట

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు అంతకు ముందు ఢిల్లీలో పలు సమావేశాలు నిర్వహించారు. మధ్యాహ్నం గం. 1.38 సమయంలో పార్టీ కార్యాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ తన ఛాంబర్లో కూర్చుని తొలుత పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన్ను కలిసేందుకు వచ్చిన వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సహా అమలు చేస్తున్న అన్ని వ్యవసాయ అనుకూల, రైతు అనుకూల విధానాల గురించి వారికి వివరించారు.

గత ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతిని గణాంకాలతో సహా వివరించి చెప్పినట్టు తెలిసింది. దేశ జనాభాలో ఈనాటికీ 80 శాతానికి పైగా జనాభా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని, వృధాగా సముద్రంలో కలుస్తున్న అనేక నదుల జలాలను సద్వినియోగం చేసుకుంటే దేశంలో వ్యవసాయ విస్తీర్ణాన్ని మరింత పెంచవచ్చని చెప్పినట్టు తెలిసింది. రైతు సంఘాల నేతలతో చర్చ అనంతరం ఆయన మొదటి అంతస్థులో ఏర్పాటు చేసిన కాన్ఫరెన్స్ హాల్, పార్టీ జాతీయ నేతలకు కేటాయించిన చాంబర్లను కేసీఆర్ పరిశీలించారు. అదే సమయంలో పార్టీ నేతలకు కొన్ని మార్పులు, చేర్పులు సూచించారు.

- Advertisement -



క్షణాల్లో పెరిగిన రద్దీ

కేసీఆర్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారన్న విషయం తెలుసుకున్న కార్యకర్తలు, నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఆయన్ను కలిసేందుకు పోటీలు పడ్డాలు. అయితే భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో తోపులాట కూడా చోటుచేసుకుంది. సకాలంలో భద్రతా సిబ్బంది కలుగజేసుకుని తోపులాటను నియంత్రించారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న అభిమానగణం పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జై కేసీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. సమావేశాలు ముగించుకున్న కేసీఆర్ తనను కలిసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ అక్కణ్ణుంచి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి చేరుకున్న కేసీఆర్‌ను అక్కడ కూడా కొంతమంది ప్రజాసంఘాల నేతలు, ప్రతినిధులు వచ్చి కలిశారు. అనంతరం ఆయన హైదరాబాద్ తిరుగుప్రయాణమయ్యారు.

బీఆర్ఎస్ కార్యాలయం వద్ద విదర్భ ప్రజానీకం

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవడం కోసం మహారాష్ట్రలోని తెలంగాణకు ఆనుకున్న ప్రాంతం విదర్భ నుంచి సామాన్య ప్రజానీకం తరలివచ్చారు. భారత రాష్ట్ర సమితిని జాతీయస్థాయిలో విస్తరించడం పట్ల వారంతా హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ యువజన విభాగం నేత ప్రశాంత్ చౌదరి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఢిల్లీలో కేసీఆర్ ను కలిసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి నేతలు, అభిమానాలు పోటీలు పడుతున్నారని తెలిపారు. తెలంగాణ సరిహద్దుల్లోని మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల ప్రజలు తెలంగాణలో అమలవుతున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పేరుతో కేసీఆర్ తెలంగాణ మోడల్ ను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని చూస్తున్నారని ఆయన తెలిపారు. కేసీఆర్ విస్తరణ ప్రయత్నాలపై హర్షం వ్యక్తం చేస్తూ వారంతా స్వాగతం పలుకుతున్నారని ప్రశాంత్ అన్నారు. మొత్తంగా దేశంలో బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు, రాజకీయేతర వేదికలు కేసీఆర్ తో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తున్నారని వెల్లడించారు. పార్టీ విస్తరణ కార్యాచరణ, వ్యూహాలు, ప్రణాళికల రచనలో కేసీఆర్ నిమగ్నమయ్యారని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement