Friday, November 22, 2024

మా గెలుపుతోనే యుద్ధానికి ముగింపు.. లేదంటే ప్రపంచ వినాశనం తప్పదు

ఉక్రెయిన్‌తో యుద్ధంపై పుతిన్‌ సలహాదారు అలెగ్జాండర్‌ సంచలన ప్రకటన చేశారు. రష్యా గెలిచిన తర్వాతే యుద్ధం ముగుస్తుందని, అప్పటివరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టంచేశారు. లేదంటే ప్రపంచ వినాశనం తప్పదని హెచ్చరించారు. ఈ ప్రకటన రష్యా అధ్యక్షుడి ఆలోచనలకు ప్రతిరూపంగా భావించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం యుద్ధం బహుళ ధ్రువ ప్రపంచం దిశగా సాగుతోందని డుగిన్‌ చెప్పారు. ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధమని చెప్పారు. ఈ యుద్ధం పశ్చిమ దేశాలకో, మరే ఇతర దేశాలకో వ్యతిరేకంగా జరుగుతున్నది కానే కాదని స్పష్టంచేశారు.

యుద్ధ ప్రభావం ప్రపంచంపై ఎలా ఉండబోతోంది, యుద్ధం ఎప్పుడు ముగుస్తుందని విలేఖరులు అడగగా.. రష్యా గెలిచిన వెంటనే యుద్ధం ఆగిపోతుందని డుగిన్‌ చెప్పారు. అయితే, అదంత సులువు కాదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచం నాశనమైతే ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం ఆగిపోతుందని వివరించారు. మేం గెలవడమా.. ప్రపంచ నాశనమా.. రెండింటిలో ఏదో ఒకటి జరగనిదే యుద్ధం ఆగదని డుగిన్‌ స్పష్టంచేశారు.

ఉక్రెయిన్‌పై70కిపైగా మిస్సైల్స్‌తో దాడులు..

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి క్షిపణుల వర్షం కురిపించింది. శుక్రవారం 70కిపైగా మిస్సైల్స్‌ను ప్రయోగించింది. దీంతో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా ఒకే రోజు ఇంత పెద్దసంఖ్యలో క్షిపణులతో విరుచుకుపడటం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో దేశంలో రెండో అతిపెద్దదైన, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సొంత పట్టణమైన క్రైవీ రిహ్‌ అంధకారంలో చిక్కుకున్నది. కీవ్‌, ఖేర్సన్‌, ఖార్కివ్‌లో విద్యుత్‌, నీటి సరఫరాకు అంతరాయం కలిగిందని అధికారులు వెల్లడించారు. క్రైవీ రిహ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై క్షిపణి పడటంతో ముగ్గురు, ఖేర్సన్‌లో మరొకరు మరణించారని తెలిపారు.

- Advertisement -

తమపై దాడిచేయడానికి రష్యా భారీ సంఖ్యలో మిస్సైళ్లను సిద్ధంచేసుకున్నదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్స్‌స్కీ అన్నారు. ఈనేపథ్యంలో పాశ్చాత్య దేశాలు కీవ్‌కు మరింత సమర్ధవంతమైన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను అందించాలని కోరారు. రష్యా దాడులకు తగిన ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement