Thursday, November 21, 2024

మన వస్త్ర పరిశ్రమ ప్రపంచంతో పోటీ పడాలి.. పత్తి ఉత్పత్తిని పెంచాలి: ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మార్కెట్ తో పోటీ పడేలా భారతీయ వస్త్ర పరిశ్రమను తీర్చిదిద్దాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మన సంప్రదాయ శక్తి సామర్థ్యాలకు పదునుపెడుతూ, ఆధునిక పద్ధతులను అవలంబిస్తూ ప్రపంచ వస్త్ర పరిశ్రమలో మనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునేలా భారతీయ వస్త్ర పరిశ్రమ దూసుకెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. భారతదేశంలో వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమ రెండో అతిపెద్ద ఉపాధికల్పన రంగంగా ఉందన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ.. ఈ రంగంలో సాంకేతికత వినియోగాన్ని పెంచడంతోపాటు కార్మికుల నైపుణ్యానికి మరింత పదును పెట్టడం, చిరు వ్యాపారులకు, చిరు ఉత్పత్తిదారులకు ఆర్థికంగా, ఇతర అవసరాలకు అనుగుణంగా మద్దతుగా నిలవడం వంటివి మన వస్త్ర పరిశ్రమ రంగాన్ని అనుకున్న లక్ష్యాలకు తీసుకెళ్లగలవని అన్నారు. వివిధ రకాల పత్తి రకాలను అభివృద్ధిచేయడంతోపాటు ఎక్స్ ట్రా లాంగ్ స్టేపుల్, సేంద్రియ పత్తి వంటి వాటికి ప్రోత్సాహాన్ని అందించాలని పేర్కొన్నారు.

మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌ లో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ టెక్స్ టైల్స్ ఇండస్ట్రీ (సీఐటీఐ) – కాటన్ డెవలప్మెంట్ అండ్ రీసర్చ్ అసోసియేషన్ (సీఆర్డీఏ) స్వర్ణజయంతి ఉత్సవాలను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ ఆర్థిక ప్రగతిలో వస్త్ర పరిశ్రమ కీలకమైన పాత్ర పోషిస్తోందన్నారు. మన నాగరికత వారసత్వానికి మన వస్త్రాలే ఓ ప్రత్యేకమైన గుర్తింపును తీసుకొచ్చాయన్నారు. ప్రాచీన కాలం నుంచి భారతీయ వస్త్రాలకు, ఇక్కడి పత్తి, వడికిన దారాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉండేదన్నారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో రాట్నం పోషించిన పాత్ర ప్రతి భారతీయుడికీ గుర్తుండిపోతుందని వెంకయ్య నాయుడు అన్నారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా సమాజాన్ని ఏకీకృతం చేయడంలో పత్తి, రాట్నం కీలకంగా మారాయన్నారు. భారతదేశంలో పత్తి ఉత్పత్తి, వస్త్రాల ఎగుమతి విషయంలో పురోగతి కనిపిస్తున్నప్పటికీ.. ప్రపంచ దేశాలతో పోలిస్తే మనం చాలా వెనుకబడి ఉన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.

మన దేశంలో హెక్టారుకు 460 కిలోల పత్తి ఉత్పత్తి అవుతుంటే అదే అంతర్జాతీయ సగటు 800 కిలోలుగా ఉందన్నారు. దీనిపై ప్రభుత్వాలతోపాటు భాగస్వామ్య పక్షాలు ప్రత్యేకమైన దృష్టిసారించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఇందుకోసం పత్తి విత్తనాలు నాటే విషయంలో, యంత్రాల వినియోగం, తదితర అంశాల్లో విస్తృతమైన పరిశోధనలు జరగాలని ఆయన అన్నారు. విత్తన సాంకేతికత, యంత్ర సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ పత్తి ఉత్పత్తిని పెంచడం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమపద్ధతులను స్వీకరించడం ద్వారా ఉత్తమమైన నాణ్యతగల పత్తిని ఉత్పత్తి చేయడంపై దృష్టి సారించాలని ఉపరాష్ట్రపతి సూచించారు. పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తూ.. వాతావరణ మార్పుల విషయంలో వారికి సరైన సూచనలు అందించే విషయంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని ఆయన అన్నారు. అప్పుడే రైతుల ఆదాయం పెరిగేందుకు వీలవుతుందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర వస్త్ర, వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయల్, సీఐటీఐ చైర్మన్ రాజ్ కుమార్, కాటన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఉపేంద్ర సింగ్, కేంద్ర వస్త్ర శాఖ కార్యదర్శి ప్రేమ్ మాలిక్, వస్త్ర పరిశ్రమ ప్రముఖులు, దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన నేత కార్మికులు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement