న్యూఢిల్లి: స్వదేశీ ఉత్పత్తుల ఎగుమతులు 400 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశాన్ని అభినందించారు. ఈ ఘనత దేశ సామర్థ్యాలను, ప్రపంచ వ్యాప్తంగా భారతీయ ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌కు సంకేతమని చెప్పారు. ఆదివారం మన్‌కీ బాత్‌లో ప్రసంగించిన ప్రధాని అనేక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఎగుమతుల రికార్డును కొనియాడారు. ఈ క్రమంలో భారత్ నిర్దేశించుకున్న రూ.30 లక్షల కోట్ల (400 బిలియన్ డాలర్లు) విలువైన ఎగుమతుల మైలురాయిని చేరుకుందన్నారు. ఇది కేవలం ఆర్థికవ్యవస్థకు చెందిన విషయం మాదిరిగానే కనిపించినప్పటికీ.. భారత శక్తి, సామర్థ్యాలకు నిదర్శనమన్నారు. భారతదేశ సరఫరా గొలుసు రోజురోజుకు బలపడటాన్ని ఇది సూచిస్తున్నదని చెప్పారు. సంకల్పాలు కలలకంటే పెద్దవి అయినప్పుడు దేశ గొప్ప ప్రగతి సాధిస్తుంది. సంకల్పాల కోసం రాత్రింబవళ్లు చిత్తశుద్ధితో కృషిచేసినప్పుడు ఆ తీర్మానాలు కూడా ఫలిస్తాయని మోడీ చెప్పారు. వ్యక్తుల జీవితాలకూ ఇదే వర్తిస్తుందన్నారు. కలల కంటే సంకల్ప ప్రయత్నాలు పెద్దవి అయినప్పుడు విజయం దానంతట అదే వస్తుందన్నారు.
ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ పోర్టల్ ద్వారా ప్రభుతం వస్తువులను కొనుగోలు చేసిందని, దాదాపు 1.5 లక్షల మంది చిరు వ్యాపారవేత్తలు తమ ఉత్పత్తిని నేరుగా ప్రభుతానికి విక్రయిస్తున్నారని ప్రధాని చెప్పారు. ఇంతకు ముందు పెద్దవ్యక్తులు మాత్రమే ప్రభుత్వానికి ఉత్పత్తులు విక్రయించగలిగేవారని, కానీ ప్రభుతం ఏర్పాటు చేసిన ఈ -మార్కెట్‌ప్లేస్ పోర్టల్ నూతన స్ఫూర్తిని తీసుకొచ్చిందని అన్నారు. భారతీయ ఉత్పత్తుల సామర్థ్యాన్ని ప్రశంసించిన ప్రధాని అందుకు దేశంలోని రైతులు, చేతివృత్తులు, చేనేత కార్మికులు, ఇంజినీర్లతో పాటు ఎంఎస్ఎమ్ఈ రంగంలోని చిన్న పారిశ్రామికవేత్తలే కీలకమన్నారు. వారి కృషి వల్లే రూ.30లక్షల కోట్ల (400 బిలియన్ డాలర్లు) విలువైన ఉత్పత్తులను ఎగుమతి చేసే లక్ష్యాన్ని భారత్ సాధించిందన్నారు. ఇలా భారత ప్రజల శక్తి, సామర్థ్యాలు విశవ్యాప్తం కావడం తనకెంతో గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
లోకల్ నుంచి గ్లోబల్..
ప్రతి ఒక్క భారతీయుడు స్థానిక గళం (లోకల్ ఉత్పత్తులకు ప్రాధాన్యం) విప్పితే.. ఇదే లోకల్, గ్లోబల్‌గా మారడానికి ఎంతో సమయం పట్టదన్నారు. తద్వారా భారత ఉత్పత్తుల విలువను మరింత ఇనుమడింపజేయవచ్చని ప్రధాని సూచించారు. దేశ నలుమూలల నుంచి కొత్త ఉత్పత్తులు విదేశీ తీరాలకు చేరుకుంటున్నాయి. అసోంలోని హైలకండి నుంచి లెదర్ ఉత్పత్తులు, ఉస్మానాబాద్ నుంచి చేనేత ఉత్పత్తులు, బీజాపూర్ నుంచి పండ్లు, కూరగాయలు, చందౌలీ నుంచి బ్లాక్ రైస్ వీటన్నిటినుంచి ఎగుమతులు పెరుగు తున్నాయి. ఇప్పుడు దుబాయ్‌లోనూ లడథ్ నేరేడు పండు కనిపిస్తోంది. సౌదీలో తమిళనాడు అరటిపండ్లు విక్రయించబడుతున్నాయి. ఉత్తరాఖండ్ తృణధాన్యాలు డెన్మార్క్‌కు ఎగుమతి అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల బంగినపల్లి, సువర్ణరేఖ మామిడిపండ్లు ద.కొరియాకు ఎగుమతి అవుతున్నాయి. మొదటిసారి నాగాలాండ్ నుంచి కింగ్ చిల్లిని లండన్‌కు పంపించారు. ఇప్పుడు విదేశాల్లో మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు మునుపటి కంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని ప్రధాని వివరించారు. 2018-19 సంవత్సరానికి గాను దేశీయ ఉత్పత్తుల ఎగుమతుల విలువ 330 బిలియన్ డాలర్లతో రికార్డు సాధించింది. తాజాగా దీనిని అధిగమిస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ 400 బిలియన్ డాలర్ల మార్కును దాటింది. గతంలో మునుపెన్నడూ లేని విధంగా భారత ఉత్పత్తులు ఈ స్థాయిలో ఎగుమతి కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి...