- తొలి అన్నదాన క్యాంప్ సిద్దిపేటదే..
- కేధార్‌నాథ్ అన్నదాన సేవా సమితి
- మంచుదుప్పటిలో సిద్దిపేట రుచులు
- ప్రతి ఏటా వేల మంది భక్తుల కడుపునింపుతున్న వైనం
- టీతో మొదలుకొని అన్నదానం వరకు
- 36 మందితో కూడిన సమితి
- 1000 మందికి ఉచితంగా వసతి
సిద్దిపేట ప్రతినిధి, (ప్రభ న్యూస్) : హిమగిరుల్లో కొలువైన ఉన్న మహిమాన్విత ఆలయం కేధారినాథ్. కేధారినాథ్.. ఛార్‌ధామ్ యాత్ర ఎంతో ప్రాముఖ్యమైంది. అత్యంత మహిమాన్వితమైన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తీర్థయాత్రల్లో పరమపావనమైనది. అత్యంత క్లిష్టమైనది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మహిమాన్వితమైన మహాయాత్ర పుణ్యస్థలం కేదారీశ్వరం. జ్యోతిర్లింగ మహాదర్శనం యాత్ర కాలంలో మన దేశం నుంచే కాక ఇతర దేశాల నుంచి లక్షలాది మంది ఈ పుణ్యయాత్ర స్థలం దర్శించి పోతుంటారు. సృష్టి స్థితిలయ కారకుడు, ఐశ్వర్య ప్రధాత, మోక్షకారకుడు, మహాలింగ స్వరూపంగా లోక కల్యాణార్థం భక్తజనులను అనుగ్రహంచడానికి సమస్థ జీవకోటిని పరిరక్షించడానికి పిలిస్తే పలికే దేవదేవుడు, మహదేవుడు. ఆ పరమశివుడు ఆవిర్భవించిన మహా పుణ్యస్థలం కేదారినాధ్ ఆధ్యాత్మిక చింతనకు, జపధ్యానములకు ఉత్తమమైన ప్రాంత స్థలం కేధార్‌నాథ్ యాత్ర. భక్తజనుల సౌకర్యార్థం అన్నదానం ఒక మహాదానం. కొండలు, లోయల్లో సాగే ఈ యాత్రకు వెళ్లేవాళ్ల ఆకలిదప్పులు తీరుస్తోంది సిద్దిపేటలోని కేధార్‌నాథ్ అన్నదాన సేవా సమితి. కేధార్‌నాథ్ (సోన్ ప్రయాగ్ బేస్ క్యాంపు)లో ఏర్పాటు- చేసిన తొలి అన్నదాన లంగర్ సిద్దిపేటదే కావడం విశేషం.
2019లో తొలిసారి విజయవంతంగా నిర్వహించగా, కరోనా కారణంగా రెండేళ్లు ఆగింది. ఈ ఆలయ దర్శనం ఆరునెలల పాటు- ఉన్నా తొలి రెండు నెలలే కీలకం. అందుకే ఈ రెండు నెలలపాటే లంగర్ కొనసాగుతుంది. సేవా సమితి ప్రతినిధులు సుమారు వంద మంది తలా కొంత డబ్బులు వేసుకొని కేధార్‌నాథ్‌లో అన్నదానం చేయడానికి పూనుకున్నారు. వాతావరణ పరిస్థితులు క్షణక్షణానికి మారుతుంటాయి. భక్తులకు ఆశించినంత ఆహారం లభించదు. అలాంటి చోట దక్షిణాది రుచులను అందించేందుకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. నిత్యం సేవా సమితి సభ్యులు యాత్రికుల కోసం వివిధ రకాల వంటకాలను సిద్ధం చేసి వడ్డిస్తారు. కేధార్‌నాథ్ యాత్రకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం భక్తులు తరలి వచ్చి దర్శించుకుంటారు. 60 రోజుల పాటు- పసందైన భోజనాన్ని యాత్రికులకు వడ్డిస్తున్నారు. సిద్దిపేటకు చెందిన వ్యాపారి చికోటి మధుసూదన్ ఈ కేధార్‌నాథ్ అన్నదాన సమితికి అధ్యక్షుడిగా అన్నీతానై వ్యవహరిస్తున్నారు.
ఎక్కడి సిద్దిపేట.. ఎక్కడి కేదార్‌నాథ్
ఎక్కడి సిద్దిపేట.. ఎక్కడి కేదార్‌నాథ్.. దాదాపు రెండువేల కిలోమీటర్ల దూరం. అయితేనేం సేవ చేయడానికి ఎంతదూరమైనా వెళ్తామంటు-న్నారు సిద్దిపేటవాసులు. ఉత్తరాఖండ్‌లో కొలువైన కేదారీశ్వరుడ్ని దర్శించుకునేందుకు ఏడాదిలో 45 రోజులు మాత్రమే అనుమతి ఉంటు-ంది. అందుకే ఆ రోజుల్లో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి లక్షలాది మంది కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ యాత్రకు వెళ్లే భక్తుల ఆకలి తీర్చేందుకు సిద్దిపేటకు చెందిన కేదార్‌నాథ్ అన్నదాన సేవా సమితి ఉచితంగా ఆహారం అందిస్తోంది. కరోనా వల్ల పోయిన ఏడాది అన్నదానం చేయలేదు. ఈ ఏడు కేదార్‌నాథ్ యాత్ర మొదలయ్యే సోన్ ప్రయాగ ప్రాంతంలో లంగర్ (క్యాంప్) ఏర్పాటు- చేసి, జలందర్ కేదార్‌నాథ్ లంగర్ కమిటీ-తో కలిసి అన్నదానం చేస్తున్నారు.
టీ- నుంచి భోజనం వరకు ..
ప్రతీరోజు తెల్లవారుజామున 4 గంటలకే ప్రారంభమయ్యే వడ్డన అర్ధరాత్రి 12 గంటల దాకా నిర్విరామంగా కొనసాగుతుంది. ఉదయం 4 గంటలకు కాఫీ, టీ-, టోస్ బిస్కట్, స్వీటు-, ఉదయం 7 గంటలకు ఇడ్లీ, వడ, పోహ, ఊతప్ప, ఉప్మా, దోశ, స్వీటు-, మైసూర్ బజ్జీ, మధ్యాహ్నం 12గంటలకు అన్నం, అవకాయ, పప్పు, కుర్మా, సాంబార్, పాపడ్, స్వీటు-, పెరుగు, 4 గంటలకు సిద్దిపేట స్పెషల్ చాట్, ప్రేమ్‌నగర్ పూరి, కచోరి, పావుబజ్జీ, మినప వడలు, ఆలుబజ్జీలు, పానీపూరి, 7గంటలకు అన్నం, పప్పు, సాంబారు, పాపడ, ఊతప్ప, ఇడ్లీ, వడ, చపాతి, నాన్, తందూరి వడ్డిస్తున్నారు. కేదార్‌నాథ్‌లో అన్నదానం చేయడానికి ఆర్థిక తోడ్పాటే కాదు.. నిరంతరం సేవ చేయడంలోనూ సిద్దిపేటవాసులు ముందున్నారు. ఈ నెల 4న సదరు శిబిరం మొదలైంది. 36 మందితో కూడిన ఈ సమితి.. పరమశివుడి పరోక్ష సేవలో క్రియాశీల పాత్ర పోషిస్తోంది. మహాదేవుడికి ప్రీతిపాత్రమైన అన్నదాన సేవలో సమితి ప్రతినిధులు తరిస్తున్నారు.1000 మందికి ఉచితంగా వసతిని కూడా కల్పిస్తున్నారు.
తృప్తికి నిర్వచనం అన్నదానం: చీకోటి మధుసూదన్, అధ్యక్షుడు, కేదార్‌నాథ్ అన్నదాన సేవాసమితి, సిద్దిపేట
తృప్తికి నిర్వచనం అన్నదానం. అన్నదానంను మించిన మహాదానం ఈ కలియుగంలో వేరేలేదు అనుటలో అతిశయోక్తి లేదు. మైనస్ డిగ్రీల చలి ఉన్నా పట్టు-దలతో పనిచేస్తున్నాం. ఎంతోమంది ఆకలి తీరుస్తున్నాం. సమితి సభ్యులు, దాతల సహకారం, మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహం వల్లే ఇది సాధ్యమైంది. కేదారీశ్వరుడి సన్నిధిలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందించడం ఈశ్వర కటాక్షంగా భావిస్తున్నాం.