తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సోమవారం గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ..
తెలంగాణ అంటేనే ఆట, పాటలని… తెలంగాణ ఆట, పాటలను ప్రపంచానికి పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని అన్నారు. ‘పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ’ తెలంగాణ రాష్ట్ర సాధనకు సమాజాన్ని చైతన్యవంతం చేసిన ప్రజాయుద్ధం గద్దర్ అని డిప్యూటీ సీఎం అన్నారు.
ఇదిలా ఉంటే గద్దర్‌ను అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తిగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం…. గద్దర్ అవార్డులను పునఃప్రారంభించాలని నిర్ణయించిందని తెలిపారు. సినీ పరిశ్రమలో అందర్నీ గౌరవించుకోవాలి, ప్రతి అవార్డు గొప్పగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం సినీ పరిశ్రమకు పెద్దపీట వేస్తోందని, ఈ పరిశ్రమ ప్రపంచ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సినీ పరిశ్రమకు ఏ సమస్య వచ్చినా పరిష్కరించేందుకు మేం సిద్ధంగా ఉన్నామని మీ అందరికీ చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నట్టు వివరించారు.
అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ పేరు మీద సినిమా అవార్డులు ఇవ్వాలని నిర్ణయించినట్లు కమిటీ సభ్యులకు వివరించారు. గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని, ఏ తేదీన నిర్వహించాలనే దానిపై కమిటీ నిర్ణయం తీసుకోవాలన్నారు. మరికొద్ది రోజుల్లో మరోసారి సమావేశమై త్వరగా నిర్ణయాలు తీసుకోవాలని కమిటీ సభ్యులను డిప్యూటీ సీఎం కోరారు.
ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమిటీ సభ్యులు నర్సింగరావు, తనికెళ్ల భరణి, సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, దిల్ రాజు, హరీష్ శంకర్, వందేమాతరం శ్రీనివాస్, అల్లాని శ్రీధర్, గుమ్మడి విమల సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.