న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : బీజేపీకి అమ్ముడుపోయినట్టు రేవంత్ రెడ్డి నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, లేదంటే నువ్వు రాజకీయ సన్యాసం చేయాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. శుక్రవారం ఢిల్లీ వచ్చిన ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, తన చేరిక గురించి ఆయనతో చర్చించారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. తాను గత నెల 25న అమిత్ షాను కలిసిన విషయం సంచలనంగా మారిందని గుర్తు చేశారు. మునుగోడులో నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించి మెజారిటీ అభిప్రాయం మేరకే రాజీనామా చేశానని వెల్లడించారు. స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా లేఖను సిద్ధం చేశానన్న ఆయన, స్పీకర్‌ను కలిసి రాజీనామా ఆమోదింపచేసుకుంటాననని చెప్పారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌కి మాత్రమే కాక తన నియోజకవర్గమూ అభివృద్ధి చెందాలని ఎన్నికలకు సిద్ధపడ్డానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా మునుగోడు తీర్పు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ పాలన మీదే తమ పోరాటమని రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు.
బీజేపీలో తన చేరికకు సంబంధించి ముందుగా బండి సంజయ్‌తో మాట్లాడగా, పాదయాత్రలో ఉన్నందున అమిత్ షాను కలవాల్సిందిగా సూచించారని ఆయన చెప్పారు. ఈనెల 21న తెలంగాణ పర్యటనకు వచ్చేందుకు అమిత్ షా అంగీకరించారని తెలిపారు. ఆరోజే కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. అమిత్ షా, నడ్డా సమక్షంలో చేరేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నానని రాజగోపాల్ చెప్పారు. ఏ ప్రాంతంలో సభ పెడితే బాగుంటుందనే విషయంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. తెలంగాణలో మలి ఉద్యమం చేయాల్సిన అవసరముందని బీజేపీ నేతలు తనను పార్టీలో చేరాల్సిందిగా చాలా కాలంగా ఆహ్వానిస్తూ వచ్చారని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించేందుకే బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడినందున, బీజేపీతోనే అది సాధ్యపడుతుందని రాజగోపాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. చరిత్రలో నిలిచిపోయే తీర్పును మునుగోడు ప్రజలు ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ మారతారన్న వార్తలను రాజగోపాల్ ఖండించారు. రాజకీయాల్లో ఎంతో అనుభవమున్న ఆయన ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారన్నారు.
తప్పుడు వ్యక్తుల చేతుల్లో కాంగ్రెస్
తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారు వచ్చి తమ మీద పెత్తనం చేస్తుంటే ఎలా ఊరుకుంటామని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. నాలుగు పార్టీలు మారి వచ్చిన రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష ఎలా ఉందో అందరూ చూశారన్నారు. తమకున్న పేరు ప్రతిష్టలను జీర్ణించుకోలేక, అప్రతిష్టపాలు చేయడం కోసమే బురద జల్లుతున్నారని విమర్శించారు. అసలైన కాంగ్రెస్ నేతలు రేవంత్ తీరుపై సంతోషంగా లేరన్నారు. కాంగ్రెస్ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయిందని తెలిపారు. బయటి పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి పార్టీని అప్పగించారన్న రాజగోపాల్, ఆయనను ముఖ్యమంత్రిని చేయడం కోసం మేము కష్టపడాలా? అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కోమటిరెడ్డి సోదరులను, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అనరాని మాటలు అనడమే రేవంత్ రెడ్డి జీవితంలో చేసిన పెద్ద పొరపాటని ధ్వజమెత్తారు. క్యారెక్టర్ లేని రేవంత్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. అలాంటి వ్యక్తితో ఉంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదని చెప్పుకొచ్చారు. 90 శాతం కార్యకర్తలు తన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. రాబోయే ఎన్నికలు పార్టీల మధ్య, రాజగోపాల్ రెడ్డి కోసం కాదన్న ఆయన మునుగోడు ప్రజలిచ్చే తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పు అని అభివర్ణించారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పును అడుగుతున్నామని తెలిపారు.
పల్లాకు రాజగోపాల్‌రెడ్డి కౌంటర్
2014లో కేసీఆర్, కేటీఆర్ చాలాసార్లు తనను టీఆర్ఎస్‌లో చేరమని కోరారని రాజగోపాల్‌రెడ్డి గుర్తు చేశారు. ఎమ్మెల్సీని చేస్తానంటూ ఆహ్వానించినా వెళ్లలేదన్నారు. 2018లో ఎన్నికల సమయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోన్ చేసి సీఎం కేసీఆర్ కలుస్తానని అంటున్నారని చెప్పారని, హుజూర్ నగర్ నుంచి పోటీ చేయడానికి రావలసిందిగా కోరినా తాను టీఆర్‌ఎస్‌కు వెళ్లలేదని వివరించారు. ఉప ఎన్నిక వస్తే భయపడేది టీఆర్ఎస్ పార్టీయేనని చెప్పారు. హుజరాబాద్ ఉప ఎన్నికలతో టీఆర్ఎస్ గ్రాఫ్ బాగా పడిపోయిందని తెలిపారు. మళ్లీ మునుగోడు ఉప ఎన్నికలంటే, ఆ పార్టీకి చాలా ఇబ్బందని ఆయన అభిప్రాయపడ్డారు. మునుగోడులో ఉప ఎన్నికలు కేసీఆర్‌కు కనువిప్పు కలిగించేందుకు వస్తున్నాయని తెలిపారు.
వివేక వెంకటస్వామి మాట్లాడుతూ… కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే కేసీఆర్ రోడ్లు, నంక్షేమ పథకాలు, రేషన్ కార్డులు ఇస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రజల ఒత్తిడితోనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కుంభకోణాల మీద కుంభకోణాలు చేస్తున్న కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని వివేక్ వెంకట స్వామి నొక్కి చెప్పారు. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్క బొట్టు నీరు లేదని విమర్శించారు. మిషన్ భగీరథ పేరుతో రూ. 40 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణకు కేసీఆర్ రాజపక్సే అంటూ వివేక్ వెంకటస్వామి ఎద్దేవా చేశారు.