పీజీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు ఉస్మానియా యూనివర్సిటీ ఇవ్వాల (శనివారం) తెలిపింది. జులై 28న జరగాల్సిన పరిక్షలు ఆగస్టు 16కు వాయిదా వేస్తున్నట్టు వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. వారం రోజులుగా విద్యార్థులు ఈ విషయంలో ఆందోళన చేస్తున్నారు. సిలబస్‌ను పూర్తి కాలేదని, పరీక్షలను ఎలా రాయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, యూనివర్సిటీ క్యాంపస్, అనుబంధ కాలేజీ ప్రిన్సిపాళ్లు, పీజీ సెంటర్లు, పరీక్షల నియంత్రణాధికారి తదితరులతో వైస్‌ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డి రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణ శనివారం భేటీ అయ్యారు. ఆ తర్వాత పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హాస్టళ్లకు సంబంధించిన సమస్యలు, ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సుల ప్రవేశంపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది.
ఇక.. సెమిస్టర్ ముగింపు పరీక్షలకు ముందు రెమిడియల్ తరగతులు ఉంటాయి. జులై 26, 27 తేదీల్లో వర్సిటీ ఇంటర్నల్ పరీక్షలు నిర్వహించనుంది. ఇంకా, MCJ (మాస్టర్స్ ఇన్ కమ్యూనికేషన్ & జర్నలిజం) కోర్సు కోసం కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET) 2023ని తిరిగి నిర్వహించాలని కూడా నిర్ణయించారు. పరీక్ష తేదీని త్వరలోనే ప్రకటించున్నారు. బిల్డింగ్ డివిజన్, ఎలక్ట్రికల్ అండ్ హెల్త్ సెంటర్ నిర్వాహకులతో జరిగిన మరో సమావేశంలో భారీ వర్షాల కారణంగా నీటి ముంపు, నిర్వహణ తదితర అంశాలపై కూలంకషంగా చర్చించినట్టు సమాచారం.