Thursday, November 28, 2024

దీర్ఘకాలిక లీజుకు ‘ఓఆర్‌ఆర్‌’…! ‘టీఓటీ’ పద్ధతిలో ఇచ్చేందుకు సర్కారు యత్నాలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న అవుటర్‌ రింగురోడ్డు(ఓఆర్‌ఆర్‌)ను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చి భారీ ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు పురపాలక శాఖ, హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతమున్న తాత్కాలిక పద్ధతిలో టోలు వసూలు చేసే విధానంలో కాకుండా కేవలం 15 నుంచి 20 సంవత్సరాల కాల వ్యవధిలో టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌(టీవోటీ) పద్ధతిలో ప్రముఖ కాంట్రాక్టు కంపెనీకి ఓఆర్‌ఆర్‌ను అప్పగించి పెద్ద మొత్తంలో ఒకేసారి ఆదాయాన్ని ఆర్జించేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమైంది. ఇందుకు సంబంధించి ట్రాన్సక్షన్‌ అడ్వైజరీని నియమించుకునేందుకు హెచ్‌ఎండీఏ తాజాగా టెండరు పిలిచింది. టీవోటీ పద్ధతిలో ఎన్ని సంవత్సరాలకు కాంట్రాక్టు సంస్థ నుంచి ఎంత మొత్తాన్ని అప్‌ఫ్రంట్‌ పేమెంట్‌గా తీసుకోవాలి, తర్వాత ఎంత మొత్తం తీసుకోవాలి అనేదానిపై లావాదేవీ సలహాదారు కంపెనీ అధ్యయనం చేసి ఒక నివేదిక ఇవ్వనుంది. దీనిపై హెచ్‌ఎండీఏ, ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.

రూ.6 వేల కోట్ల దాకా అప్‌ఫ్రంట్‌ పేమెంట్‌ ఆశిస్తున్న సర్కారు…

158 కిలోమీటర్ల పొడవుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న అవుటర్‌ రింగ్‌ రోడ్డు ఆర్థికంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. చాలా చోట్ల ఇంటర్‌ ఛేంజ్‌లు కలిగి ఉండి భవిష్యత్తులో ట్రాఫిక్‌ చిక్కులు రాకుండా ఉండే విధంగా ఈ రోడ్డును నిర్మించారు. ప్రస్తుతం ఈ రోడ్డుపై రోజుకు ఒక లక్షకుపైగా వాహనాలు టోల్‌ చెల్లిస్తూ ప్రయాణిస్తున్నాయి. ప్రస్తుత విధానంలో హెచ్‌ఎండీఏ కేవలం తాత్కాలిక ప్రాతిపదికన టోల్‌ వసూలు చేసేందుకు కాంట్రాక్టు ఏజెన్సీని నియమించింది. ఈ సంస్థ టోల్‌ వసూలు చేసి నెలకు రూ.30 కోట్ల దాకా హెచ్‌ఎండీఏకు చెల్లిస్తోంది. అయితే హైదరాబాద్‌ నగరం ప్రపంచస్థాయి నగరంగా శరవేగంగా ఎదుగుతుండడంతో భవిష్యత్తులో ఈ రోడ్డుపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగి టోల్‌ వసూలు భారీగా పెరిగే అవకాశం ఉందని పురపాలక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో దీర్ఘకాలిక టోల్‌ వృద్ధిని దృష్టిలో ఉంచుకుని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) తరహాలో టోల్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ పద్ధతిలో ఈ రోడ్డును ప్రైవేటు సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని ద్వారా ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి రూ.6 వేల కోట్లపైనే ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆదాయానికి తోడు రోడ్డు నిర్వహణ బాద్యతను కూడా అదే ప్రైవేటు కంపెనీ చూసుకోనుండడంతో హెచ్‌ఎండీఏపై నిర్వహణ భారం కూడా తగ్గనుందని అధికారులు చెబుతున్నారు.

కలిసిరానున్న పన్నేతర ఆదాయం…

అవుటర్‌ రింగ్‌ రోడ్డును టీవోటీ పద్ధతిలో దీర్ఘకాలిక లీజుకు ఇస్తే ప్రభుత్వానికి ప్రస్తుతమున్న ఆర్థిక గడ్డు పరిస్థితుల్లో భారీగా పన్నేతర ఆదాయం కలిసి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హెచ్‌ఎండీఏ, టీఎస్‌ ఐఐసీల ద్వారా రాష్ట్రంలోని భూముల వేలం వేసి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్న ప్రభుత్వానికి ఓఆర్‌ఆర్‌ రూపంలో మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement