తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బోనాల ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్‌లో ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలపై రాష్ట్ర జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుపుకొంటున్న బోనాల ఉత్సవాలను గతంలో కంటే ఘనంగా జరిగేలా చూడాలని అధికారులకు చెప్పారు. జిల్లా పరిధిలోని 2,400 ఆలయాలకు ఇచ్చే చెక్కుల పంపిణీని త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇక ఈసారి ఆలయాలకు ఇచ్చే డబ్బులను పెంచాలన్న విజ్ఞప్తిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని మంత్రి వెల్లడించారు. బోనాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కాగా, వచ్చే నెల 7వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.