అమరావతి, ఆంధ్రప్రభ: గ్రంథాలయ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచే ఫైల్ ఆర్థిక శాఖ ఆమోదంతో న్యాయశాఖ పరిశీలనలో ఉంది. అనంతరం సీఎంవో ఆమోదంతో ఉత్తర్వులు వెలువడనున్నాయి. జిల్లా గ్రంధాలయ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు 62 సంవత్సరాలకు రిటైర్మెంట్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డితో కలిసి ఉద్యోగ సంఘ నాయకులు పలుమార్లు కోరారు.
మరోవైపు ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 30 వరకు పలువురు ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో వారంతా జీవో రాకపోవడం పట్ల ఆందోళన చెందుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డా.కళ్లేపల్లి మధుసూదనరాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి బీరం వెంకటరమణ తెలిపారు. ఆర్థిక శాఖ ఆమోదంతో, న్యాయ సమీక్ష అనంతరం త్వరలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు కూడా 62 సంవత్సరాల రిటైర్మెంట్ వయస్సు వర్తింపజేస్తూ ఉత్తర్వులు వెలువడనుందన్నారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి, అధికారులకు, కాకర్ల వెంకట రామిరెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.