హైదరాబాద్ నగరంలో నేడు (గురువారం) సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం దంచికొట్టింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
భారీ వర్షాలకు రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. మ్యాన్ హోల్స్ దగ్గర నీరు వెళ్లేందుకు అడ్డంకులు తొలగిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని జీహెచ్‌ఎంసీ అధికారులు నగర ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఏదైనా అనుకోని విపత్తు సంభవించినట్లయితే వెంటనే 040-21111111, 9000113667 నంబర్లకు ఫోన్ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు. మరోవైపు హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాత్రిపూట కూడా వర్షం కురిసే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.