విపక్షాల నుంచి గత 24 సంవత్సరాలుగా తనపై వస్తోన్న దుర్భాషలు వింటూనే ఉన్నానని.. చివరకు ఆ గాలి మాటలను పట్టించుకోవడం లేదని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇప్పటివరకు 101 సార్లు విపక్షాలు తనను దుర్భాషలాడాయని పార్లమెంట్ సభ్యుడొకరు లెక్కించి చెప్పారన్నారు. ఎన్నికలు ఉన్నా, లేకపోయినా ఆ ప్రతిపక్ష నేతల ప్రవర్తన అలాగే ఉంటుందని దుయ్యబట్టారు. నిరాశలో ఉన్నవారికి దూషించడం ఒక స్వభావంగా మారిపోయిందని మండిపడ్డారు.
చివరి దశపోలింగ్ ముందు మీడియాతో మాట్లాడుతూ, తమను అణచివేసేందుకు కేంద్రం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ వస్తోన్న విమర్శలపై స్పందిస్తూ, . ”అందుకు నిదర్శనం ఏంటని చెత్తను విసిరే వ్యక్తిని అడగండి. నేను ఆ చెత్తను ఎరువుగా మార్చి, ఈ దేశం కోసం మంచి ఉత్పత్తులను అందిస్తాను. పదేళ్లపాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో కేవలం రూ.34 లక్షలనే స్వాధీనం చేసుకున్నారు. కానీ గత 10 ఏళ్ల కాలంలో రూ.2,200కోట్లను ఈడీ సీజ్ చేసింది. దేశానికి అన్నికోట్ల రూపాయాలను వెనక్కి తెచ్చిన వ్యక్తిని గౌరవించాలి.. నిందించకూడదు. ఆ డబ్బును దొంగతనం చేసిన వ్యక్తి పట్టుబడిన తర్వాత అరుస్తుంటాడు. మా ప్రభుత్వం అవినీతిని ఏమాత్రం ఉపేక్షించదు” అని స్పష్టం చేశారు.
కేజ్రీవాల్ కు చురకలు
ఎవరు జైలుకు వెళ్లాలో మోదీ నిర్ణయిస్తారని దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ..”ఇలాంటి వ్యక్తులు ఈ దేశ రాజ్యాంగం, చట్టంపై అవగాహన పెంచుకోవాలి. నేను ఎవరికి ఏమీ చెప్పనవసరం లేదు” అని చురకలు అంటించారు.
తృణమూల్ ది హత్యా రాజకీయాలే
అలాగే పశ్చిమ బెంగాల్‌లో పార్టీ ప్రదర్శన గురించి ప్రస్తావించారు. ”బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అస్తిత్వం కోసం పోరాడుతోంది. ఈసారి మేం అక్కడ మంచి పనితీరు ప్రదర్శిస్తాం. అక్కడ హత్యలు, దాడులు సర్వసాధారణంగా మారాయి. ఎన్నికల ముందు భాజపా కార్యకర్తలను జైళ్లలో బంధిస్తున్నారు. ఇన్ని అకృత్యాల మధ్య.. ప్రజలు ధైర్యంగా బయటకు వచ్చి ఓటేస్తు్న్నారు’ అని అన్నారు.