Tuesday, November 26, 2024

Delhi | బెంగళూరులో భేటీ కానున్న ప్రతిపక్షాలు.. రంగంలోకి సోనియా గాంధీ!

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రతిపక్షాల ఐక్యతను, బలాన్ని చాటేందుకు సిద్ధమయ్యాయి. ఈసారి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికి 24 పార్టీలు హాజరుకానున్నాయి. గత నెలలో బిహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధినేత నితీశ్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ సహా 15 పార్టీలు హాజరైన విషయం తెలిసిందే. జులై 17 (సోమవారం) నుంచి బెంగళూరులో రెండ్రోజుల పాటు జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశం ద్వారా అధికార కూటమికి సవాల్ విసరాలని నేతలు భావిస్తున్నారు. ప్రతిపక్షాల పాట్నా సమావేశం అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చీలిక తీసుకొచ్చి, మహారాష్ట్ర ప్రభుత్వంలో చేర్చుకుని షాకిచ్చిన అధికారపక్షానికి తమ బలం ఏమాత్రం తగ్గలేదు, మరింత పెరిగింది అని చాటేలా ఈ సమావేశం నిర్వహించేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.

అందుకే వేదికగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ)ని మట్టికరిపించి ఘన విజయంతో అధికారం చేపట్టిన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరును ఎంపిక చేసింది. కాషాయదళాన్ని, దాని మిత్రపక్షాలను వ్యతిరేకించే అన్ని రాజకీయ పార్టీలను ఈ వేదికపైకి తీసుకురావాలని చూస్తోంది. ఢిల్లీ ప్రభుత్వంపై పెత్తనాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంటులో వ్యతిరేకిస్తామంటూ హామీ ఇస్తేనే బెంగళూరు సమావేశానికి హాజరవుతామంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పెట్టిన షరతులకు సైతం కాంగ్రెస్ పరోక్షంగా అంగీకారం తెలుపుతోంది.

- Advertisement -

శనివారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక కమిటీ సమావేశం అనంతరం ఏఐసీసీ మీడియా ఇంచార్జ్ జైరాం రమేశ్ మాట్లాడుతూ దేశంలో సమాఖ్య వ్యవస్థపై దాడి జరుగుతోందని, రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని, గవర్నర్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ పనులు చేస్తోందని విమర్శించారు. ఈ చర్యలకు తాము వ్యతిరేకమని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై చర్చకు డిమాండ్ చేస్తామని అన్నారు. నేరుగా కేజ్రీవాల్ డిమాండ్‌కు తలొగ్గినట్టు కాకుండా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

మొత్తంగా ఈ సమావేశంలో బీజేపీని వ్యతిరేకించే అన్ని పార్టీలను ఒక వేదికపై తీసుకొచ్చి బలప్రదర్శన చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, డీఎంకే, జేడీ(యూ), ఆర్జేడీ, సీపీఐ, సీపీఐ (ఎం), ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం), శివసేన (ఉద్దవ్ థాక్రే వర్గం), సమాజ్ వాదీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ (ఎంఎల్), జేఎంఎం, ఆర్‌ఎల్‌డీ, ఆర్ఎస్పీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెస్ (ఎం), వీసీకే, ఎండీఎంకే, కేడీఎంకే, కేరళ కాంగ్రెస్ (జే), ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలు హాజరుకానున్నాయి.

మమతకు సోనియా ఫోన్

కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బెంగళూరు సమావేశానికి 24 పార్టీలు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. అయితే కాలికి తగిలిన గాయం కారణంగా తాను రాలేకపోతున్నానంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ సందేశం పంపించారు. తనకు బదులుగా ప్రతినిధిని పంపిస్తానని కూడా చెప్పారు. కానీ వేదికపై మమత బెనర్జీ లేకపోతే కనిపించే లోటు, వెలితి గురించి కాంగ్రెస్ కలత చెందింది. అసలు కారణమేదైనా.. ప్రతిపక్షాల్లో ఐక్యత లేదని అధికార కూటమి దుష్ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుందని భావించిన కాంగ్రెస్, ఎలాగైనా సరే ఆమెను ఒప్పించాలని నిర్ణయించుకుంది.

ఏకంగా సోనియా గాంధీయే స్వయంగా రంగంలోకి మమత బెనర్జీకి ఫోన్ చేశారు. గాయం గురించి ఆరా తీసి, పరామర్శించడంతో పాటు వీలు కుదిరితే బెంగళూరు భేటీకి రావాలని కోరారు. పాట్నా సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే హాజరవగా.. బెంగళూరు సమావేశాన్ని నిర్వహిస్తున్నదే కాంగ్రెస్ కాబట్టి తాను కూడా సమావేశంలో పాల్గొంటానని సోనియా గాంధీ చెప్పినట్టు తెలిసింది. సోనియా ఫోన్‌తో మమత కూడా మనసు మార్చుకున్నట్టు సమాచారం.

భేటీలో ఉమ్మడి ఎజెండా ఖరారు?

దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ 40% కంటే తక్కువ ఓట్లతోనే అన్ని సీట్లు గెలుపొంది అధికారం సాధించడం వెనుక ఆ పార్టీని వ్యతిరేకించే ఓట్లు చీలడమేనని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 37.36 శాతం ఓట్లతో 303 స్థానాల్లో సొంతంగా గెలుపొందింది. 60% కంటే ఎక్కువ ఓటర్లు బీజేపీని వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ ఓట్లు వేర్వేరు పార్టీల మధ్య చీలిపోయినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈసారి బీజేపీ బలం మరింత పెరిగినా సరే.. వ్యతిరేకించే ఓట్లను ఏకతాటిపైకి తీసుకొస్తే ధీటుగా ఎదుర్కోవచ్చని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి.

ఆ క్రమంలోనే ‘ఉమ్మడి అభ్యర్థి’ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. పాట్నా సమావేశంలో ఇదే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. దేశవ్యాప్తంగా కనీసం 450 నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయాన్ని అమలు అంత ఆషామాషీ విషయమేమీ కాదు. ప్రతిపక్షాల సమావేశానికి హాజరైనంత మాత్రాన అందులో ఉన్న పార్టీలన్నీ మిత్రపక్షాలేమీ కాదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఆయా పార్టీల మధ్య రాజకీయ వైరం ఉంది.

ఇలాంటప్పుడు ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయడం అంత సులభం కాదు. టికెట్ ఆశించి భంగపడిన అభ్యర్థులు తిరుగుబావుటా ఎగరేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇలాంటి పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బలమైన ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం కార్యవర్గాలను ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నాయి. బెంగళూరు సమావేశంలో ఉమ్మడి ఎజెండాను ఖరారు చేసి, అమలు చేయడం కోసం మూడు కమిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement