హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. అసెంబ్లి ఎలక్షన్స్ ముంగిట పార్టీలు హామీల వర్షాలు మొదల య్యాయి. అధికార భారాస, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ లాంటి పార్టీలు అధికారంలోకి వస్తే తాము ఏమేమీ చేయబోతున్నామో చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఓట్ల కోసం ఇచ్చే వాగ్ధానాలుగా కొన్ని మిగిలిపోతున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై విమర్శలు చేసిన వారే ఇప్పుడు తాము అధికారంలోకి వస్తే వాటిని డబుల్ చేస్తామని వరాలు కురిపిస్తున్నారు. వాటిపై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతోం ది. భారాస తీసుకున్న నిర్ణయాలపై కాంగ్రెస్, బీజేపీ ఒంటికాలుపై లేచి విమర్శలు చేశాయి. ఆచరణ సాధ్యం కాదన్నాయి. ప్రశ్నల వర్షం కురిపించాయి. అనుమానాలు ఉన్నాయంటూ రోడ్డెక్కాయి. తీరా ఎన్నికల సమయానికి అవే హామీలను ఇస్తున్నారు. కేసీఆర్ ఆలోచనలు, బీఆర్‌ఎస్ నిర్ణయాలు ఆచరణ సాధ్యమే అని విపక్షాలు నమ్ముతున్నాయా..? అనే సందేహాలను తాజాగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలతో మొదలయ్యాయి.
దళిత బంధు మొదలైనప్పుడు ఆ పథకం అందరికి అందాలంటే 20ఏళ్లు పడుతుంది అని కాంగ్రెస్ చెప్పింది. కానీ వాళ్లే ఎస్సీ, ఎస్టీలకు 12లక్షలను ఇస్తామంటున్నారు. ఇంటింటికి నీరు ఇవ్వడం సాధ్యం కాదు అన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా హర్ ఘర్ జల్ అనే పథకాన్ని తీసుకువచ్చింది. రైతు బంధు మొదలు పెట్టిన సమయంలో ఇవ్వడం సాధ్యం కాదంటూ విమర్శించారు. అదే ఎన్డీఏ ప్రభుత్వం దాన్నీ కాపీ కొట్టి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో అమలు చేస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, పథకాలు ఆచరణ సాధ్యం కాదు.. డబ్బు ఏది..? కేటాయింపులు ఎలా అని అడిగారు. కానీ అధికారంలోకి వస్తే అంతకన్నా ఎక్కువ చేస్తాం అని హామీ ఇస్తున్నారు. ఇక్కడే సగటు ఓటర్‌కు డౌట్ ప్రారంభమైంది. కేసీఆర్ చెప్పేది సాధ్యం కాదు అన్న వాళ్లు ఎలా అమలు చేస్తారు..? ఒక వేళ సాధ్యం అవుతుంది అనుకుంటే కేసీఆర్, బీఆర్‌ఎస్ చెప్పేది అబద్ధం కాదు కదా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేసీఆర్, బీఆర్‌ఎస్ అబద్ధపు హామీలు ఇస్తున్నారు అనే విమర్శలు తప్పే అన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. సగటు ఓటర్ ఆలోచనలో కాంగ్రెస్ విమర్శల తీరు, భారాస పని విధానాన్ని భేరీజు వేసుకుంటున్నారు. విమర్శల్లో వాస్తవం లేనివాటిని విశ్వసించడం లేదన్నది గత రెండు ఎన్నికల్లో నిరూపితమైందని భారాస వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఒట్టి మాటలే.. అవే వాస్తవం
2014లో భారాస ఇచ్చిన హామీలపై మొదట్లో కాంగ్రెస్, బీజేపీతో పాటు చిన్నా చితక పార్టీలు అగ్గిమీద గుగ్గిలమయ్యాయి. వాటిని నెరవేర్చడం సాధ్యం కాదని తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ తాజాగా చేసిన డిక్లరేషన్‌లలో వాటిని ప్రస్తావించింది. 2014 ఎన్నికల సమయంలో ఆసరా పెన్షన్‌ను 1000 రూపాయలు ఇవ్వడమే గగనంగా మాట్లాడారు. వాటిని అమలు చేసి భారాస సర్కార్ చూపించింది. తర్వాత 2018లో 1000 నుంచి 2016కు పెంచుతామని హామీ ఇచ్చారు. రెండో సారి అధికారం చేపట్టిన తర్వాత భారాస సర్కార్ దానిని అమలు చేసింది. ఇప్పుడు ఎలాగైనా అధికారం చేజిక్కుంచుకోవాలనే కాంగ్రెస్ పార్టీ ఆసరాను 4000 రూపాయలకు పెంచుతామని హామీని ఇచ్చింది. దళిత బంధు పథకం ప్రారంభించిన మొదట్లో అందరికి ఇవ్వడం అసాధ్యమంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసమే దళిత బంధును తీసుకు వచ్చారని ఎద్దేవా చేశారు. దాన్ని ప్రతి నియోజకవర్గంలో అమలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో అంబేద్కర్ అభయ హస్తం కింద 12 లక్షల ఆర్థిక సాయం చేస్తామంటూ హామీ గుప్పించింది. డబుల్ బెడ్ రూమ్‌లను సాధ్యమైనన్ని నిర్మాణం చేశారు. మిగతా చోట్ల గృహలక్ష్మీ పథకం కింద భారాస సర్కార్ మూడు లక్షల రూపాయల వరకు అందించేందుకు సిద్ధమవుతోంది. ఆ పథకాన్ని ఇందిరమ్మ పక్కా ఇళ్ల స్కీమ్ పేరుతో రూ.6 లక్షల దాకా ఇస్తామంటూ వెల్లడించారు.
భారాస చేసిందే చేస్తే మీరెందుకు..?
పోడు భూముల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతున్న సందర్భంలో ప్రతిపక్షాలు విపరీతమైన విమర్శలు, ఆరోపణలు గుప్పించాయి. అసాధ్యమన్నాయి. గగ్గోలు పెట్టాయి. తీరా ఇచ్చాక మళ్లిd తాము అధికారంలోకి వస్తే వాటినే ఇస్తామంటూ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రిజర్వేషన్లను పెంచుతామని భారాస ప్రకటించిన తరుణంలో గగ్గోలు పెట్టిన కాంగ్రెస్, బీజేపీలు తాము అధికారంలోకి వస్తే వాటిని చేస్తామంటూ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. రుణమాఫీ సైతం ఒక లక్ష వరకు చేస్తామని గత ఎన్నికల్లో భారాస చెప్పింది. ప్రస్తుతం చేసి చూపించింది. ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ సైతం రెండు లక్షల రుణమాఫీ అంటూ ప్రకటించింది. కానీ ప్రజలు భారసనే నమ్మారు. కారుకే జై కొట్టారు. ఇప్పుడూ హస్తం పార్టీ అదే రెండు లక్షల రూపాయల రుణమాఫీని చేస్తామని మరోసారి ప్రకటిస్తోంది. భారాస చేసిన వాటినే అమలు చేస్తే కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలి అనే ప్రశ్నలు ఉత్ఫన్నం అవుతున్నాయి. ఇప్పటికే భారాస చేసి చూపించిన తర్వాత హస్తం పార్టీ కొత్తగా అధికారంలోకి వచ్చి చేసేది ఏముందని ప్రజల్లో చర్చ సాగుతోంది. తాము అధికారంలోకి వస్తే ఎలా చేస్తాము..? ఏమేమి ప్రజలకు ఉపయోగపడే పనులను, పథకాలను చేయబోతున్నామో చెప్పాలని కానీ.. నాడు విమర్శించిన నోళ్లే నేడు చేస్తామనడం విడ్డూరంగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
నాడు కష్టతరం.. నేడు సుభీక్షం
అధికారంలోకి రావాలనుకోవడం ప్రతి పార్టీ ఒక్క సహజ లక్షణం. కానీ అధికారంలోకి వస్తే తాము ఏం చేస్తాం. ఎలా చేస్తామని చెప్పకుండా.. ఓట్ల కోసం ఏది పడితే అది హామీలుగా ఇవ్వడం అనేది ఎంత వరకు కరెక్ట్ అన్న సందేహాలను రాజకీయ వేత్తలు లేవనెత్తుతున్నారు. ప్రజల్లో వస్తున్న విశ్వాసాన్ని పోగొట్టుకోవడం తప్పితే మరొకటి కాదని వెల్లడిస్తున్నారు. భారాస చెప్పింది. వాటిని చేసి చూపించింది. నాడు వద్దు.. ఇవ్వలేరు అంటూ మొత్తుకున్న నోళ్లే నేడు చేస్తామని చెబుతున్నాయంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేశామని భారాస తెలుపుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం సాధ్యం కాదన్నారు. నీళ్లు తీసుకురావడం కష్టతరమని విమర్శలు చేశారు. నేడు ఉత్తర తెలంగాణకు అందుతున్న సాగు నీరును చూసి విమర్శించిన నేతలు మాట మార్చారు. ఇప్పటికీ కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికారంలోకి వస్తే కట్టబోయే ఒక్క పెద్ద ప్రాజెక్టును ప్రకటించలేదు. ఉన్న ప్రాజెక్టులపై రాజకీయాలు చేయడం తప్పా.. వ్యవసాయానికి అవసరపడే పనులు, ప్రాజెక్టులు ఏంటీ అనే ఆలోచనలను చేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జనం నుంచే సేకరణ
అధికార భారాస పార్టీ హ్యాట్రిక్ సాధించడంపై సీరియస్‌గా దృష్టి సారించింది. ప్రజాకర్షక నిర్ణయాల కన్నా జనం కోరుకునే అవసరాలపైనే ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై సుదీర్ఘ కసరత్తును చేస్తుంది. గత రెండు ఎన్నికల్లో చెప్పినవే కాదు.. చెప్పనివి కూడా చేసి చూపించామని వివరిస్తున్నారు. రైతు బంధు, దళిత బంధును ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ వాటిని అమలు చేసి సక్రమంగా అందిస్తున్నామని తెలుపుతున్నారు. రైతు బంధుతో 2018 ఎన్నికల్లో వార్‌ను వన్ సైడ్ చేశారు. ఆసరా పెన్షన్‌దారులు, రైతులు కారుకు జై కొట్టారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ లాంటి అంశాలు రైతులకు మేలు చేశాయి. ఇలాంటి పలు కొత్త అంశాలు జనం నుంచి సేకరిస్తూ హామీలను గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు. మేనిఫెస్టో రూపకల్పన మొదలైందన్న చర్చ సాగుతోంది. భారాస ఈ సారి ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే వాగ్ధానాలను ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.