Tuesday, November 26, 2024

హౌస్‌ కమిటీల్లో వ్యక్తిగత సహాయకులా? – రాజ్యసభ చైర్మన్‌ తీరుపై విపక్షాల మండిపాటు

న్యూఢిల్లిd: రాజ్యసభ చైర్‌పర్సన్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ సంప్రదాయానికి భిన్నంగా ఎగువసభ పరిధిలోని వివిధ #హౌస్‌ కమిటీల్లో ఎనిమిది మంది వ్యక్తిగత సిబ్బందిని నియమించారు. వివిధ కమిటీలను నిశితంగా పరిశీలించేందుకే ఇలా చేశారని, ఇప్పటికే ఉన్న యంత్రాంగంపై ఆయనకున్న అప నమ్మకానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడ్డారు. వివిధ కమిటీల పరిణామాలు, చర్చల గురించి రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునే అధికారులను సెక్రటేరియట్‌ లేదా రాజ్యసభ ఛైర్‌పర్సన్‌ నియమిస్తారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కామన్‌ పూల్‌ నుంచి అధికారులను నియమిస్తారు. రాజ్యసభ పరిధిలోకి వచ్చే 20 స్టాండింగ్‌ కమిటీలకు ఎనిమిది మంది కొత్త అధికారులను అటాచ్‌ చేసినట్లు రాజ్యసభ సెక్రటేరియట్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. కొత్తగా చేరినవారు జూనియర్‌ స్థాయి అధికారులు. వారి పనితీరులో కమిటీలకు సహాయం చేస్తారు. ఈ ప్రక్రియలో చాలా వరకు గోప్యంగా ఉంచబడతాయి.

ఉపరాష్ట్రపతి నిర్ణయాన్ని ”విచిత్రమైన చర్య”గా కాంగ్రెస్‌ అభివర్ణించింది. తన వ్యక్తిగత సిబ్బందిని అధికారులుగా నియమించడం ద్వారా వివిధ కమిటీలపై నిఘా ఉంచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కమిటీ చర్చల్లో వివిధ పరిణామాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తెలియజేసే ప్రస్తుత అధికారుల యంత్రాంగంపై ఆయనకు విశ్వాసం లేదని అర్ధమవుతోందని కాంగ్రెస్‌ నాయకులు తెలిపారు. 2014లో 67 శాతంగా ఉన్న బిల్లుల పరిశీలన ఇప్పుడు 14 శాతానికి పడిపోయిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement