Saturday, November 23, 2024

Delhi: భారత్‌లో పర్యాటకానికి పుష్కలమైన అవకాశాలు.. టూరిజానికి ఈశాన్యం స్వర్గధామం: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారతదేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు మంగళవారం ఢిల్లీలో జరిగిన ‘హిందుస్థాన్ టైమ్స్ టూరిజం కాంక్లేవ్’లో ఆయన మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులకు, భిన్న సంప్రదాయాలకు నిలయమైన భారతదేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలున్నాయన్నారు. ఆధ్యాత్మిక పర్యాటకం, సాంస్కృతిక పర్యాటకం, వైద్య పర్యాటకం, అడ్వెంచర్ టూరిజం ఇలా భారతదేశంలో వివిధ రకాల పర్యాటకాల అభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు.

ఈ దిశగా కేంద్ర ప్రభుత్వంతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో ప్రైవేటు రంగం కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా అనంతర పరిస్థితుల్లో భారతదేశంలో పర్యాటక, ఆతిథ్య రంగాలను మరింతగా సుస్థిరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఈశాన్య రాష్ట్రాల్లో స్విట్జర్లాండ్‌ను మైమరిపించే అద్భుతమైన పర్యాటక కేంద్రాలున్నాయని, వాటిని సందర్శించాలని ఆయన సూచించారు. ఈశాన్య రాష్ట్రాల్లో పర్యాటకానికి ఉన్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం అక్కడ రైల్వే, రోడ్డు అనుసంధాన కార్యక్రమాలను వేగవంతంగా పూర్తిచేస్తోందని, దాదాపు 90 సొరంగాల నిర్మాణం జరుగుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 2024 నాటికి ఈ కార్యక్రమం పూర్తవుతుందని ఆయన ఆంకాంక్షించారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఈశాన్య రాష్ట్రాల మధ్య ఆరోగ్యవంతమైన పోటీ నెలకొందని తద్వారా ఆయా రాష్ట్రాల్లో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం లభిస్తోందని కేంద్ర మంత్రి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటకానికి ప్రోత్సాహాన్ని అందించడం వల్ల మహిళలకు సాధికారతతోపాటు యువత ఉపాధి కల్పనకు బాటలు పడతాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భారతదేశంలోనూ 3,600కు పైగా పురాతన కట్టడాలను గుర్తించి వాటిని డిజిటైజ్ చేస్తున్నామని చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయితే ఇంట్లో కూర్చునే.. ఏ పురాతన కట్టడాన్ని సందర్శించడం సాధ్యపడుతుందని, దాని ప్రత్యేకతలేంటి, అక్కడ ఏమేం వసతులున్నాయి అనే విషయాలు ఒక్క క్లిక్ తో తెలుసుకోవచ్చన్నారు. ఇటీవలి కాలంలో కొన్ని పురాతన కట్టడాల నిర్వహణను ప్రైవేటు కంపెనీలకు అప్పగించామని తద్వారా ఆయా కట్టడాల సంరక్షణ, పర్యాటకులకు అవసరమైన వసతుల కల్పన జరుగుతోందన్నారు.

భారతదేశ పర్యాటక రంగానికి కొత్త ఊపిరిలూదేందుకు ‘జాతీయ పర్యాటక విధానానికి’ రూపకల్పన జరుగుతోందని కిషన్ రెడ్డి తెలిపారు. సుస్థిర, సమగ్రమైన పర్యాటక రంగాభివృద్ధే ఈ పాలసీ లక్ష్యమన్నారు. పర్యావరణహిత పర్యాటక రంగం కోసం నేషనల్ గ్రీన్ టూరిజం మిషన్ ను ముందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. భారత పర్యాటక రంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే బ్రాండ్ అంబాసిడర్ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత్ తోపాటు స్విట్జర్లాండ్ సహా వివిధ దేశాల పర్యాటక, ఆతిథ్య రంగ ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement