Sunday, October 6, 2024

ఆప‌రేష‌న్ రాబందు! న‌క్స‌ల్స్ జాడ‌ కోస‌మే వ‌చ్చిందా?

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, సెంట్ర‌ల్ డెస్క్‌: దండకారణ్యంలోని ఓ సురక్షిత ప్రాంతంలో భారీ వర్షంలో తలదాచుకున్న మావోయిస్టుల జాడ ఎలా బయటపడింది? మావోయిస్టుల కొరియర్లు పోలీసులకు దొరికారా? వారి సమాచారంతోనే ధులి థులి ప్రాంత అడవిని పోలీసులు అంచనా వేశారా? అనే అంశాలు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

అయితే.. మానవ హక్కుల సంఘాలు మాత్రం మ‌రో కొత్త అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చాయి. ఎన్‌కౌంట‌ర్ జ‌ర‌గ‌డానికి సరీగా మూడు రోజుల కిందట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఏకలవ్య పాఠశాల నిర్మాణ ప్రాంతానికి ఓ రాబంధు వ‌చ్చింది. దీన్ని గిరిజనులు మచ్చిక చేసుకుని కోడి మాంసం పెట్టారు.

అయితే.. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో గిరిజనులు దాన్ని విడిచిపెట్టారు. కానీ, అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖ‌ల అధికారులు ఈ రాబందును పట్టుకునేందుకు నానా తంటాలు పడ్డారు. ఎట్టకేలకు రాబందు దొరికింది. అది మధ్య ప్రదేశ్‌లోని పెన్న టైగర్ జోన్‌లోని వల్చర్ పాయింటు నుంచి దండకారణ్యానికి వ‌చ్చిన‌ట్టు అధికారులు తేల్చి చెప్పారు.

ఎన్నో అనుమానాలు..

ఇక్కడే పౌరహక్కుల సంఘాలు, సామాన్య జ‌నం నుంచి అనేక అనుమానాలను వ్యక్తం అవుతున్నాయి. ఇది నిజంగా రాబందు జాతి అన్వేషణకు వచ్చిన పక్షేనా? అదే నిజమైతే, ఈ పక్షి జనం మధ్యకు ఎందుకు వస్తుంది? తన ఆహారం కోసం సహజ సిద్ధంగా కళేబరాలను వెతకాలి కదా? జనం చెంతకు ఎందుకు చేరుతుంది? కాళ్లకు జీపీఎస్, అత్యంత ఆధునిక కెమెరాను పెన్న అధికారులు బిగించారంటే.. ప్రభుత్వ అధికారులే భద్రత దళాల ఆపరేషన్ కోసం రాబందును సృష్టించారా? అనే అనుమానాలను పౌరసంఘాల నేతలు వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఎందుంటే.. చర్ల మండలంలో ఈ రాబందు ప్రత్యక్షం కావటంతో.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దండకారణ్యం మార్మోగిపోయింది. రాబందు ఫోటోను ఇటు మావోయిస్టులు, అటు పోలీసులు .. పౌరహక్కుల సంఘాలు నిశితంగా పరిశీలించటంతో.. అనేక అనుమానాలు తెరమీదకు వచ్చాయి.

సరికొత్త పంథాలో పోలీసు బలగాలు

ఇప్పటికే దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా కేంద్ర పోలీసు బలగాలు జల్లెడ పడుతున్నాయి. ల్యాండ్ మైన్ల కారణంగా భారీగా నష్టపోయిన సీఆర్పీఎఫ్ బలగాలు.. మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. మావోయిస్టుల ట్రాప్ లో పడకుండా తమ ఆచూకీ కోసం సరికొత్త పంథా అనుసరిస్తున్నాయి. ఈ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఓ వైపు డ్రోన్ల సాయంతో అణువణువూ పరిశీలిస్తున్నాయి.

నిఘా పెంచిన క్రమంలోనే రాబందులను కూడా వినియోగిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమను ఏరివేసేందుకు పోలీసులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారని, అటవీ గ్రామాల్లో భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని మావోయిస్టు నేతలు గతంలో ఆరోపణలు చేయడం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న చర్ల పరిసరాల్లో రాబందు ప్రత్యక్ష్యం కావడం ఈ ఆరోపణలు బలాన్నిచ్చింది.

సమాచార వ్యవస్థ లేని మావోయిస్టులు..

ఇక.. మావోయిస్టులు ఇప్పుడు పూర్తిగా డిఫెన్సులో ఉన్నారు. ఇప్పుడు వీరికి ఎలాంటి సమాచార వ్యవస్థ లేదా గూఢచార వనరులు లేవు. 31 మంది నక్సలైట్ల మరణమే ఇందుకు నిదర్శనం. గడచిన 11 రోజుల్లో ఇది మూడో ఎన్‌కౌంటర్. సెప్టెంబర్ 24న కూడా సుక్మా జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు.

ఇద్దరి మృతదేహాలను సహచరులు ఎత్తుకెళ్లారు. నిజానికి మావోయిస్టు నేతలు అడవుల్లో సమావేశాలకు ప్లాన్ చేస్తున్నప్పుడు సైనికుల ఆనుపానులను ముందే గుర్తిస్తారు. భారీ వర్షం కారణంగా పర్వతం మీద ఒక ప్రదేశంలో ఆగి, వర్షం ఆగేవరకూ వేచి ఉన్నారని చెబుతున్నారు.

కానీ పర్వతం మీదన్న మావోయిస్టులు కూడా పహారాలో ఎక్కడా తగ్గరు. కనీసం రెండు మూడు కిలో మీటర్ల దూరంలోని శత్రువును పసిగట్టగలరు. పది కిలోమీటర్లు చిత్తడి నేలలో 1500 మంది బలగాలు టార్గెట్టుకు చేరాయంటే.. పకడ్బంధీ సమాచారంతోనే ఈ ఎన్ కౌంటర్ జరిగినట్టు పౌరహక్కుల సంఘాల ప్రతినిధులు అంచనా వేస్తున్నారు.

జీపీఎస్, కమాండ్ కంట్రోల్ సమాచారాన్ని ముందే పసిగట్టి భద్రతాదళాలకు ఉప్పు అందించటంతోనే ఇంత భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుందని, ఈ ఆపరేషన్ లో రాంబధు కూడా భాగస్వామే అని పౌరహక్కుల సంఘాలు అనుమానిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement