అన్నల కోసం అన్వేషణ! మావోయిస్టు అగ్రనేతల కోసం సెర్చింగ్
హిట్ లిస్టు రెడీ చేసుకున్న పోలీసులు
దండకారణ్యంలో ఎలిమినేషన్ ఆపరేషన్
నిఘా డ్రోన్లతో నిరంతరం పహారా
దూసుకుపోతున్న భద్రతా బలగాలు
మావోయిస్టు అగ్రనేతల రహస్య ప్రదేశాలే టార్గెట్
37 మంది కీలక నేతల్లో ఇదరు మృతి
ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడి మృతి ఇదే మొదటిసారి
35 మంది కీలక నేతల కోసం కొనసాగుతున్న కూంబింగ్
ఆంధ్రప్రభ, సెంట్రల్ డెస్కు: దండకారణ్యంలో ఎలిమినేషన్ ఆపరేషన్ కొనసాగుతోంది. దండకారణ్యాన్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు అడవుల్లో లోలోపలకు దూసుకుపోతున్నాయి. యాంటీ నక్సల్స్ ఫోర్సెస్ దండకారణ్యంలోనే తిష్టవేశాయి. ఛత్తీస్ గఢ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, సీఆర్‌పీఎఫ్, కోబ్రా, ఒడిశాకు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఇలా అన్ని బలగాలు జాయింట్ ఆపరేషన్స్ తో అడవులను జల్లెడపడుతున్నాయి. ప్రధానంగా మావోయిస్టుల అగ్రనేతల రహస్య ప్రదేశాలను టార్గెట్ పెట్టి ముందుకు పోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరిన్ని ఎన్‌కౌంటర్లు జరుగుతాయనే భయం ఆ ప్రాంతవాసుల్లో నెలకొంది.
2026 నాటికి క్లియర్ చేస్తామంటున్న అమిత్‌షా
2026 చివరి నాటికి మావోయిస్టు కార్యకలాపాలు లేకుండా క్లియర్ చేస్తామని కేంద్రం అంటోంది. ఈ క్రమంలో భద్రతా దళాలు ముందుకు వెళుతున్నాయి. ప్రధానంగా వృద్ధాప్యంలో ఉన్న నేతలను సజీవంగా పట్టుకుంటే మావోయిస్టు మూలలు ఉండవన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. గరియాబంద్ ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి, మరో జోనల్ కమిటీ సభ్యుడు బాలన్న మృతి చెందారు. అయితే ఒక కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందడం ఇదే మొదటిసారి. అందుకే విజయం సాధించినట్లు కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్‌షా ప్రకటించారు. వీరు వృద్ధాప్యంలో ఉన్నారు. దాదాపు కీలకనేతలంతా వృద్ధాప్యంలో ఉన్నట్లు పోలీసులు లెక్కలు చూపిస్తున్నాయి. అయితే వీరిని సజీవంగా పట్టుకుంటే మావోయిస్టు మూలలు తెలుస్తాయని పోలీసులు భావన.
35 మంది అగ్రనేతలే పోలీసుల టార్గెట్..
మావోయిస్టు పార్టీలో 37 మంది అగ్రనేతల్లో ఇద్దరు మృతి చెందగా, మరో 35 మంది అడవుల్లో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వారి కోసమే అడవుల్లో జల్లెడ పడుతున్నారు. చందు (వరంగల్), రఘు అలియాస్ వికాస్ (వరంగల్), విమల (ఆదిలాబాద్), ప్రతాప్ (ఏపీ), రణధీర్ (వరంగల్), నిర్మల అలియాస్ కోడి మంజుల (తెలంగాణ) మావోయిస్టు కమిటీల్లో వివిధ హోదాల్లో ఛత్తీస్ గఢ్ దండకారణ్యాల్లో పని చేస్తున్నారు. మిగితా వారిని ప్రాణాలతో పట్టుకోవడం లేదంటే లొంగిపోయేలా చూడడం లేదంటే ఎదురుకాల్పులు జరిగితే హతమార్చడమే టార్గెట్ గా బలగాలు కూంబింగ్ జరుపుతున్నాయని తెలుస్తోంది.
ప్రముఖ లీడర్లు వీరే..
పోలీసుల హిట్ లిస్టులో మావోయిస్టు కీలక నేతలున్నారు. అందులో.. గణేష్, రాజమోహన్ అలియాస్ యాదగిరి ( హన్మకొండ ), చిన్నన్న అలియాస్ నాగన్న (ఆత్మకూర్ ఏపీ ), సుజాత అలియాస్ సుజాతక్క, మధు అలియాస్ కమలాకర్, గోపి అలియాస్ గోపన్న (ఏపీ వాసులు). దీనా అలియాస్ నందే, సరిత అలియాస్ అరుణ (నల్గొండ), రుపీ, అనిత, తక్కళ్లపల్లి వాసుదేవరావు (వరంగల్), సత్యగంగాధర్ రావు (విశాఖపట్నం), ప్రమోద్ అలియాస్ పాండూ యాప్రాల్ (రంగారెడ్డి), కమలేష్ అలియాస్ రామకృష్ణ (విజయవాడ), కేశవరావ్ అలియాస్ గంగన్న (శ్రీకాకుళం), గణపతి అలియాస్ లక్ష్మణ్ రావు (కరీంనగర్) మల్లోజుల వేణుగోపాల్ ( కరీంనగర్), తిరుపతి (కరీంనగర్), కీలక నేతలుగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. ఉదయ్ అలియాస్ గణేష్ (నల్గొండ), రామచంద్రారెడ్డి (కరీంనగర్), చందూ అలియాస్ చందర్ (వరంగల్), గౌతమ్ అలియాస్ గోపన్న (కరీంనగర్), పూలూరి ప్రసాద్ రావు ( పెద్దపల్లి), కంకణాల రాజిరెడ్డి (మంథని ), సంజీవ్ అలియాస్ అశోక్ (రంగారెడ్డి ) ఉన్నారు. రవి అలియాస్ భాస్కర్ (నిజామాబాద్), రెడ్డి అలియాస్ శ్యాం (వరంగల్ ), కమలేష్ అలియాస్ నాగరాజు (విజయవాడ) వీరంతా ఉద్యమంలో ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు వేస్తోందని తెలుస్తోంది. వీరిని పట్టుకుంటే ఉద్యమం నీరుగారుతోందని కేంద్ర అంచనాకు వస్తోంది. ఏమి జరుగుతుందో చూడాలి.