Friday, November 22, 2024

‘ఆపరేషన్ కావేరీ’ ప్రారంభం.. యుద్ధభూమి నుంచి జన్మభూమికి భారతీయులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: సూడాన్ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆపరేషన్ కావేరీ’ వేగవంతమైంది. మంగళవారం సూడాన్‌లోని పోర్ట్ సూడాన్ పట్టణానికి తరలించిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత నావికాదళానికి చెందిన యుద్ధ నౌక INS Teg అక్కడికి చేరుకుంది. తరలింపు ప్రక్రియలో తీసుకొచ్చే భారతీయులకు అవసరమైన ఆహార పదార్థాలతో పాటు అత్యవసర మందులు, వైద్య సిబ్బందిని కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. ఐఎన్ఎస్ తేజ్ యుద్ధ నౌకకు తోడుగా సమీప సముద్ర జలాల్లో మరో యుద్ధ నౌకను సిద్ధంగా ఉంచినట్టు నావికాదళం వర్గాలు తెలిపాయి.

- Advertisement -

మరోవైపు సూడాన్‌ దేశంలో 3,000 మందికి పైగా భారతీయులు వేర్వేరు ప్రాంతాల్లో చిక్కుకున్నారని భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇప్పటికే గురితప్పిన తుపాకీ తూటా తగిలి ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇంకెవరూ ఈ పరిస్థితిని ఎదుర్కోకుండా ప్రతి భారతీయుణ్ణి సురక్షితంగా స్వదేశానికి తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో వివిధ దేశాల దౌత్య సిబ్బంది సహకారాన్ని తీసుకుంటోంది. ఫ్రాన్స్ ప్రభుత్వం సైతం తమ పౌరులతో పాటు కొందరు భారతీయులను సురక్షితంగా తరలించింది. అయితే భారత దౌత్య సిబ్బంది సూడాన్‌లో చిక్కుకున్న భారతీయుల్లో కొందరిని అతికష్టం మీద సముద్ర తీర పట్టణం పోర్ట్ సూడాన్‌కు చేర్చింది. అక్కణ్ణుంచి నావికాదళానికి చెందిన యుద్ధ నౌక ద్వారా వారిని భారతదేశానికి తీసుకొస్తున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement