Friday, November 22, 2024

ఆపరేషన్‌ గంగ వేగం పెంచాలి, కేంద్రానికి సుప్రీం కోర్టు సూచన

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల అంశంపై.. సుప్రీం కోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్‌లో ఇరుక్కుపోయిన భారతీయ విద్యార్థులు, పౌరులు ప్రతీ ఒక్కరినీ దేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకునేలా చూడాలని అటార్నీ జనరల్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది. అవసరమైతే.. విద్యార్థుల తల్లిదండ్రుల కోసం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని సూచించింది. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయన్లో ఉండిపోయిన భారతీయుల తరలింపునకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల వివరాలను అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సుప్రీం ధర్మాసనానికి వివరించారు. ఇప్పటి వరకు 17వేల మంది భారతీయులను ఉక్రెయిన్‌ నుంచి సురక్షితంగా దేశానికి చేర్చినట్టు తెలిపింది. ఉక్రెయిన్‌లో ఉన్న మిగిలిన వారిని కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని అటార్నీ జనరల్‌ ధర్మాసనానికి వివరించారు.

పాఠాలు నేర్వకుండా యుద్ధాలు..

పిటిషనర్స్‌లో ఒకరైన ఉక్రెయిన్‌లోని భారత విద్యార్థితో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఫోన్‌లో మాట్లాడినట్టు అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సుప్రీం కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆ విద్యార్థి రొమానియాకు చేరుకున్నారని, 24 గంటల్లో ప్రత్యేక విమానంలో మిగిలిన విద్యార్థులతో పాటు ఆ విద్యార్థిని కూడా దేశానికి తీసుకురానున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంపై సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గత చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్వకుండా ఇంకా యుద్ధాలకు దిగడం దురదృష్టకరం అని పేర్కొంది. ఈ విషయంలో ఇంతకుమించి చెప్పగలిగింది ఏమీ లేదని, అయితే విద్యార్థుల క్షేమం తమను ఆందోళనకు గురి చేస్తున్నట్టు పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ గంగను మరింత వేగవంతం చేయాలని సూచించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement