హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఐరోపా దేశమైన లిథువేనియా హైదరాబాద్‌లో కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ప్రథమ గౌరవ కాన్సులేట్‌గా దివి ల్యాబ్స్ సీఈవో కిరణ్ సశ్చంద్ర దివి నియమితులయ్యారు. ఇప్పటికే ఢిల్లి, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో కాన్సులేట్ కార్యాలయాలున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రాయబార కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వీలుగా హైదరాబాద్‌లో కాన్సులేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు లిథువేనియా రాయబార కార్యాలయం వెల్లడించింది.
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆదివారం ఏర్పాటు చేసిన కాన్సులేట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి లిథువేనియా ఆర్థిక ఇన్నోవేషన్ వైస్ మినిస్టర్ కరోలిస్ జమైటిస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యాలయం ఏర్పాటు వల్ల తెలుగు రాష్ట్రాల్లో లిథువేనియన్ సంస్కృతి సంప్రదాయాలపై ఇక్కడి ప్రజల్లో అవగాహన కల్పించడానికి వీలవుతుందన్నారు. అంతేకాకుండా ఇక్కడ నివసిస్తున్న లిథువేనియా పౌరులకు మద్దతిచ్చినట్లవుతుందని చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం చేసుకునేందుకు ఈ రాయబార కార్యాలయంతో మరింత అవకాశం ఏర్పాటవుతుందని అన్నారు.