ఢిల్లీ: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈరోజు ఏపీ కాంగ్రెస్ సమన్వయ భేటీ జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మాణిక్కం ఠాగూర్, ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం సందర్బంగా ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధత, అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తులు, చేరికలు, పార్టీ బలోపేతం, కాంగ్రెస్ గ్యారెంటీలపై చర్చ జరిగింది. అలాగే, ఏపీ కాంగ్రెస్ యాక్టీవిటీ రిపోర్టును రుద్రరాజు అధిష్టానానికి అందించారు. పీసీసీగా ఏడాది కాలంలో చేసిన కార్యక్రమాలతో 700 పేజీల యాక్టీవిటీ రిపోర్ట్‌ను రుద్రరాజు సిద్ధం చేశారు.
ఇక, జనవరిలో ఏపీలో మూడు సభల కోసం ఖర్గే, రాహుల్, ప్రియాంకను రుద్రరాజు ఆహ్వానించారు. హిందూపురంలో ఖర్గే, విశాఖలో రాహుల్, అమరావతిలో ప్రియాంక గాంధీ సభలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షర్మిలకు అథిష్టానం పిలుపు.. వైఎస్ఆర్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిలకు హస్తినకు రావలసిందిగా కాంగ్రెస్ అధిష్టానం ఆహ్వానం పంపింది.. ఎపిలో కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవానికి షర్మిలను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయంపై చర్చించేందుకు ఆమెను డిల్లీకి పిలిచినట్లు సమాచారం..వైఎస్ఆర్ టిపి ని కాంగ్రెస్ లో విలీనం చేసేలా షర్మిలను ఒప్పించేందుకు అగ్రనాయకత్వం ప్రయత్నిస్తున్నది.. పార్టీ విలీనం చేసినట్లయితే ఎపి కాంగ్రెస్ పగ్గాలు ఆమెకే అప్పగించనున్నట్లు సమాచారం.