Friday, November 22, 2024

Khammam : బ‌హిరంగ సభను విజ‌య‌వంతం చేయాలి : మంత్రి హ‌రీష్ రావు

ఖమ్మంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నాయకత్వాన సన్నాహాక సమావేశం జరిగింది. పట్టణ శివార్లలోని మామిడి తోటలో జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చాయి. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రి తన్నీరు హరీష్ రావు, లోకసభలో బీఆర్ఎస్ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు పార్థసారథి రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… మహానేత కేసీఆర్ అహింసా మార్గంలో మహోద్యమాన్ని నడిపి ప్రజల చిరకాల వాంఛ అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. అలాగే, అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేస్తున్నారని, ప్రజా సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం చిరునామాగా మారిందని వివరించారు. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత మొట్టమొదట జరుగుతున్న ఈ సభ చారిత్రాత్మకమైనదని, దేశ రాజకీయాలలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టే ఖమ్మం సభను దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి చెప్పారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్, కేరళ, పంజాబ్, ఢిల్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు విజయన్, భగవంత్ సింగ్ మాన్, అరవింద్ కేజ్రీవాల్, ఎస్పీ అధినేత,ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొని దిశానిర్దేశం చేసే ఈ బహిరంగ సభకు లక్షలాదిగా తరలి రావలసిందిగా హరీష్ రావు కోరారు.
సంక్రాంతి సంబురాలను ప్రారంభించిన హరీష్ రావు…
స్థానిక ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబురాలను మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు బాంధవుడు కేసీఆర్ చిత్రపటాలకు మంత్రితో పాటు ఎంపీ లు రవిచంద్ర, నాగేశ్వరరావు, పార్థసారథి రెడ్డి, మాజీ మంత్రి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిలు పూలతో అభిషేకం చేశారు. మహిళలు వేసిన రంగవళ్లులు, గంగిరెద్దుల విన్యాసాలను వీక్షించారు, భోగి మంట వేశారు. చిన్నారులకు రేగు పండ్లు, పూలు, అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వర రావు, డీసీఎంఎస్ ఛైర్మన్ రాయల్ శేషగిరి రావు, మునిసిపల్ ఛైర్మన్ మహేష్, వైస్ ఛైర్మన్ సుజల రాణి,బీఆర్ఎస్ నాయకులు సర్థార్ పుట్టం పురుషోత్తం, గుండ్లపల్లి శేషగిరిరావు, జల్లెల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement