Thursday, November 21, 2024

సర్కారు దవాఖానాల్లో సాయంత్రం కూడా ఓపీ సేవలు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఇక నుంచి సాయంత్రం కూడా ఓపీ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. రాష్ట్ర వైద్య విభాగానికి చెందిన అన్ని జనరల్‌, మెటర్నిటీ ఆసుపత్రుల్లో సాయంకాలం కూడా ఓపీ సేవలు అందించాలని ఆదేశించింది. భారీవర్షాలకు రోగులు ఆసుపత్రులకు క్యూ కడుతుండడంతో ఇకపై సాయంత్రం కూడా ఓపీ వైద్య సేవలు అందించనున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చే రోగులకు ఉదయం వేళ ఓపీలో టెస్టులు రాస్తే వాటి రిపోర్టులు వచ్చాక… మరుసటి రోజు ఉదయం మళ్లి చికిత్స అందిస్తున్నారని, దీంతో రోగులు తీవ్ర ఇబ్వందులు ఎదుర్కొంటున్నారని మంత్రి హరీష్‌రావు దృష్టికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో రోగులకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉదయం వచ్చిన టెస్టు రిపోర్టుల ఆధారంగా సాయంత్రం చికిత్స అందించేందుకు ఇకపై ఓపీ సేవలను కూడా అందించాలని ఆదేశించారు.

మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ తాజా ఉత్తర్వులను జారీ చేసింది. అన్ని ప్రభుత్వ, మెటర్నిటీ ఆసుపత్రుల్లో ప్రతీ రోజు ఉదయం 7.30 గంటలకే ఓపీ స్లిప్స్‌ పంపిణీ ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక మొదటి పేషెంట్‌ నుంచి చివరి రోగి వరకు అందరినీ వైద్యులు పరీక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. అన్ని పని దినాల్లో సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు కూడా ఓపీ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఉదయం సమయంలో రక్త నమూనాలను సేకరించి సాయంత్రం వరకల్లా రిపోర్టులను సిద్ధం చేయాలని సూచించింది. సాయంత్రం ప్రారంభమయ్యే ఓపీ సేవల్లోనే సంబంధిత రోగులకు మందులు రాసి పంపించాలన్నారు. ఓపీ సమయాల్లో తప్పకుండా ల్యాబ్‌లు కూడా పనిచేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement