ఆంధ్రప్రభ స్మార్ట్, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న సర్కారు బడి అది. 73 మంది విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకే ఒక్క టీచర్ ఐదు తరగతులకు బోధిస్తున్నారు. ఒక్క టీచర్ తో పిల్లలందరికీ చదువు ఎట్లా సాగుతోందని, విద్యార్థులకు తగిన విధంగా ఉపాధ్యాయులను నియమించాలని కలెక్టర్ రాజర్షిషాకు కోరారు. ఒకవేళ ఉపాధ్యాయులను నియమించకపోతే బడికి తాళం వేసి తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తామని హెచ్చరించారు.
ఉపాధ్యాయుల పదవీ విరమణ తోనే అవస్థలు
తాంసి మండలం పొన్నారి పాఠశాలలో ఇటీవల ఇద్దరు టీచర్లు పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఉపాధ్యాయురాలు సరిత మాత్రమే ఉన్నారు. 73 మంది విద్యార్థులను ఒకే చోట చేర్చి ఆమె పాఠాలు బోధిస్తున్నారు. దీనివల్ల తమ పిల్లలు చదువుల్లో వెనుకబడిపోతున్నారని తల్లిదండ్రులు వాపోయారు. సర్దుబాటు ద్వారా ఇద్దరు టీచర్లను నియమించాలని, లేదంటే తమ పిల్లలను జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్ కు పంపిస్తామని కలెక్టర్‌కు తేల్చి చెప్పారు. సర్కారు బడికి తాళం వేసి మూసివేస్తామని హెచ్చరించారు. ఉన్న ఒక్క టీచర్ సెలవు పెడితే బడి మూతపడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
గోట్కూరి లోనూ అదే పరిస్థితి..
తాంసి మండలం గొట్కూరి గ్రామంలో 60 మంది పిల్లలకు ఒక టీచర్ విధులు నిర్వర్తిస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఆందోళన చేయడంతో ఉర్దూ పాఠశాల నుంచి మరో టీచర్‌ను సర్దుబాటు చేశారు. బోధన సిబ్బంది కొరతతో సర్కారుబడుల్లో చదువులు మొక్కుబడిగా సాగుతున్నాయి అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సర్దుబాటుకు టీచర్ల కొరత ఉంది : ఎంఈఓ
తాంసి మండలంలో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోందని ఎంఈఓ శ్రీకాంత్ తెలిపారు. పొన్నారి గ్రామానికి టీచర్ ను సర్దుబాటు చేద్దామన్నా ఎక్కడా అదనపు ఉపాధ్యాయులు లేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఈ విషయమై డీఈవో దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు తెలిపారు.
మూడు మండలాలకు ఒకే ఒక్కడు
ఆదిలాబాద్ జిల్లా తామ్సి, బజార్హత్నూర్, భీంపూర్ మండలాలకు ఒకే ఒక్క మండల విద్యాధికారి పర్యవేక్షిస్తున్నారు. తాంసి హైస్కూల్లో పీజీహెచ్ఎంగా పనిచేస్తున్న శ్రీకాంత్ తాంసి, బీంపూర్ మండలాలతోపాటు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బజార్హత్నూర్ మండలంలోనీ సర్కారు బడులను పర్యవేక్షించాల్సి వస్తోంది. స్కూళ్లలో టీచర్ల కొరత, మండలాల్లో విద్యాధికారుల పోస్టులు ఖాళీగా ఉండటంతో సర్కార్ బడుల పర్యవేక్షణ లోపంగా మారింది.
పొన్నారి స్కూలును సందర్శించిన ఎమ్మెల్యే
73 మంది పిల్లలకు ఒకే ఒక్క టీచర్ బోధన సాగిస్తున్నారని, సర్దుబాటు ద్వారా ఉపాధ్యాయులను నియమించాలని పొన్నారి గ్రామస్తులు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు విన్నవించారు. ఎమ్మెల్యే మంగళవారం పాఠశాలను సందర్శించి విద్యార్థులు, తల్లిదండ్రుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఉన్న టీచర్ సెలవు పెడితే బడికి తాళం వేయాల్సి వస్తుందని గ్రామస్తులు ఎమ్మెల్యేకు వివరించారు. కలెక్టర్ తో ప్రత్యేకంగా చర్చించి అదనపు ఉపాధ్యాయులను నియమిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.