Saturday, November 23, 2024

రాష్ట్రాన్ని గట్టెక్కించే సమర్థత చంద్రబాబుకు మాత్రమే ఉంది : కనకమేడల రవీంద్ర కుమార్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గట్టెంక్కించే సమర్థత ఒక్క చంద్రబాబు నాయుడుకు మాత్రమే ఉందని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం ఢిల్లీలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన కారణంగా జరిగిన నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి పాలనతో ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి వేడుకగా జరుపుకున్న ఆయన, అంతకంటే ముందు పార్లమెంటు భవనంలో ఉన్న తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలోనూ జన్మదిన వేడుకలు జరిపారు. అనంతరం 10, లోఢి ఎస్టేట్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు ఎన్నో డ్రీమ్ ప్రాజెక్టులను ప్రారంభించారని, అందులో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 30 వేల ఎకరాలకు పైగా భూ సమీకరణ జరిపి అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టడం ఒకటని అన్నారు. అయితే ఒక్క అవకాశం ఇవ్వండి అన్న జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వాగ్దానాలు నమ్మి రాష్ట్రం మోసపోయిందని కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. అర్థరాత్రి మహిళ స్వేచ్ఛగా తిరగగల్గిన రోజు దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చినట్టని మహాత్మా గాంధీ అన్నారని, కానీ రాష్ట్రంలో మగవాళ్లే తిరగలేని పరిస్థితి ఉందని అన్నారు. ఫ్యాక్షనిస్ట్ కి అధికారం ఇవ్వడంతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్ళిందని కనకమేడల ఆరోపించారు. మరోసారి తన మోసపూరిత వాగ్దానాలతో జగన్ జనం ముందుకు వస్తున్నారని, ఈసారైనా జనం తాము చేసిన పొరపాటు గ్రహించి చంద్రబాబు నాయుడుకు మళ్లీ అధికారం అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

వివేకా హత్యకేసులో సూత్రధారులు బయటపడతారన్న భయంతో విచారణను శతవిధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కనకమేడల మండిపడ్డారు. రాష్ట్రంలో పథకాల పేరుతో జనాన్ని మభ్యపెడుతున్నారని, ప్రతి స్కీం ఒక స్కాం అని ఆరోపించారు. సంక్షేమం పేరుతో రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. ఇలాంటి పరిస్థితుల్లో గట్టెక్కించే మార్గం ఏంటనేది ఏపీ ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని హితవు పలికారు. రాష్ట్రానికి చంద్రబాబు అవసరం చాలా ఉందని, సంక్షేమాన్ని, అభివృద్ధిని జోడెద్దుల్లా నడిపించగల సమర్థత కేవలం చంద్రబాబుకు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. సంపద సృష్టించే వనరులు ఏమున్నాయో చెప్పి ప్రజలను ఓట్లడగాలి అని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. 73 ఏళ్ల వయస్సులోనూ 24 గంటలూ ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్న చంద్రబాబును మళ్లీ ఎన్నుకోవాలని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement