Friday, November 22, 2024

ఇంకా రాని వరదలు, బోసిపోతున్న రిజర్వాయర్లు.. శ్రీశైలం, సాగర్​కు స్వల్ప ఇన్​ఫ్లో మాత్రమే..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వర్షాకాలం మొదలై నెల పూర్తికావస్తున్నా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవకపోవడంతో వరద జలాలు రాక తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు బోసిపోతున్నాయి. రోజూ పలు జిల్లాల్లో భారీ, నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచిస్తున్నా… ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులకు వరద పోటెత్తడం లేదు. ఫలితంగా కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు కేవలం 842 క్యూసుక్కుల వరద మాత్రమే వస్తుండగా… నాగార్జునసాగర్‌కు 6764 క్యూసెక్కుల వరద కొనసాగుతోంది. శ్రీశైలం పూర్తి సామర్థ్యం 215 .81 టీఎంసీలు కాగా… ప్రస్తుతం రిజర్వాయర్‌లో 43.68 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. ఇక సాగర్‌లో 312.051 టీఎంసీలకు గాను 173.66 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇక గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌కు 3761 క్యూసెక్కులు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 1621 క్యూసెక్కుల అతి స్వల్ప వరద మాత్రమే కొనసాగుతోంది.

మూసీకి పోటెత్తిన వరద…

హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. రెండు, మూడు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. వరద పోటెత్తడంతో నల్గొండ జిల్లాలోని మూసి ప్రాజెక్టు మూడు గేట్లను అడుగు మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మూసి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 644.61 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1247.79 క్యూసెక్కులు కొనసాగుతుండగా… అవుట్‌ఫ్లో 1992.74 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు గేట్లను ఎత్తినందున మూసీ ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అనుమతి లేకుండా చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement