Friday, November 22, 2024

Delhi | ఐదేళ్లలో తెలంగాణ నుంచి కేవలం 79 మందే అడ్వకేట్ నోటరీలు: ఎంపీ నామ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం వద్ద ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అడ్వకేట్ నోటరీల వ్యవహారాన్ని తేల్చాలని బీఆర్ఎస్ లోక్‌సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణాతో సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నోటరీలకు సంబంధించి కేంద్రం వద్ద 63,051 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చన్నారు. ఐదేళ్లుగా తెలంగాణాతో సహా దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి ఎందుకు నెలకొందని తాను అడిగిన ప్రశ్నలకు కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి రామ్ అర్జున్ మేఘవాల్ సమాధానమిచ్చారని నామ తెలిపారు.

నోటరీ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారన్నారు. నోటరీల నియామకం నిరంతర ప్రక్రియ అని, దానికి ఒక సమయమంటూ ఏది ఉండదని, కాలానుగుణంగా మారుతున్న నోటరీస్ రూల్స్ అనుగుణంగా నియామకాలు జరుగుతాయని కేంద్రమంత్రి జవాబిచ్చిన విషయాన్ని నామ చెప్పుకొచ్చారు. తెలంగాణ నుంచి కేవలం 79 మందిని మాత్రమే కేంద్ర నోటరీలుగా నియమించి కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

- Advertisement -

గుజరాత్‌కు ఐదేళ్లలో 1,896 మందిని, మహారాష్ట్రలో 1949 మందిని, రాజస్థాన్‌లో 786 మందిని, ఉత్తరప్రదేశ్‌లో 504 మందిని, కర్నాటకలో 570 మందిని, బీహార్ 168 మందిని, ఆంధ్రప్రదేశ్ నుంచి 172 మందిని కేంద్ర నోటరీలుగా నియమించి, తెలంగాణా నుంచి కేవలం 79 మందిని మాత్రమే నియమించడమేంటని నామ నాగేశ్వరరావు మండిపడ్డారు. నోటరీ కోసం దరఖాస్తు చేసుకున్న న్యాయవాదులను నోటరీలుగా నియమించుకుండా కాలయాపన చేస్తూ ఎందుకు ఇబ్బందిపెడుతున్నారని నామ నిలదీశారు. 2021లో తెలంగాణా సహా దేశవ్యాప్తంగా న్యాయవాదుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించినా ఇంతవరకు ఎవరినీ నోటరీలుగా నియమించకపోవడం కేంద్రవ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని నామ ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement