హైదరాబాద్, ఆంధ్రప్రభ: గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 3,895 మంది దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. గ్రూప్-1కు దరఖాస్తు చేసుకోవాలంటే ఓటీఆర్ తప్పనిసరి ఉండాల్సిందే. అయితే సోమవారం సాయంత్రం వరకు కొత్తగా ఓటీఆర్ చేసుకున్న వారు 68,793 మంది కాగా, ఓటీఆర్‌ను సవరణ చేసుకున్నవారు 1,54,785 మంది ఉన్నారు. 25 లక్షల్లో ఇప్పటి వరకు కేవలం 2,23,578 మంది అభ్యర్థులు మాత్రమే ఓటీఆర్ చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉంటే గ్రూప్-1 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న పది మంది అభ్యర్థుల నుండి టీఎస్పీఎస్సీ అభిప్రాయాన్ని సేకరించింది.
ఓటీఆర్‌ను అప్డేట్ చేస్తున్నప్పుడు, దరఖాస్తును సమర్పించేటప్పుడు ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్నారా? లేదా? అని ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్లు కమిషన్ పేర్కొంది. ఏవైనా సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించే విధంగా ఈ స్పెషల్ డ్రైవ్‌ను చేపట్టినట్లు తెలిపింది. అభ్యర్థులందరూ కూడా ఓటీఆర్‌ను అప్లోడ్ చేయడంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోలేదని తెలియజేసినట్లు కమిషన్ పేర్కొంది. కేవలం 5 నుంచి 8 నిమిషాల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసేలా కమిషన్ జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. చివరి రోజు (మే 31) వరకు దరఖాస్తు చేసుకోవడానికి వేచిచూడకుండా వీలైనంత త్వరగా గ్రూప్-1కు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..