Saturday, November 23, 2024

Big Story | కార్తీక మాసం కలిసొచ్చేనా?.. నోటిఫికేషన్ నుంచి ఎన్నికలకు 27 రోజులే!

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ శాసనసభకు ఏక కాలంలో, ఒకే దశ ఎన్నికలు నవంబర్‌ 30న నిర్వహించనున్నారు. ఆ రోజు గురువారం కార్తీక మాసం ఆరుద్ర నక్షత్రం కావడంతో సహజంగానే ఎవరికి కలిసిరానుందనే ఉత్కంఠ నెలకొంది. ఆరుద్ర నక్షత్రం కార్తీక మాసం శివుడికి ప్రీతిపాత్రమైన దినం ఆవడంతో ఎన్నికల తేదీ కీలకం కానున్నది. నవంబర్‌ 3న ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేయనున్న ఎన్నికల సంఘం నామినేషన్ల దాఖలుకు నవంబర్‌ 10ని చివరి తేదీగా పేర్కొంది.

నవంబర్‌13న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు చివరితేదీగా నవంబర్‌ 15ను షెడ్యూల్‌లో పేర్కొంది. కాగా పోలింగ్‌ నవంబర్‌ 30న నిర్వహించి ఓట్ల లెక్కింపును డిసెంబర్‌ 3న చేపట్టనున్నారు. నోటిఫికేషన్‌కు, ఎన్నికలకు మధ్య 27 రోజుల గడువు ఉండనుంది. ఇది స్వల్ప సమయమేని విశ్లేషకులు అంటున్నారు. 2014 అసెంబ్లి ఎన్నికల సమయంలో ఎన్నికలకు 29 రోజుల సమయం పట్టింది. 2018లో 24 రోజుల గడువు ఉండగా ఇది ఈ సారి కొంత మేర పెరిగింది.

ఈ 29 రోజుల సమయంలో పోఎలింగ్‌ ముగియనుండగా, డిసెంబర్‌ 3 దాకా ఫలితాల కోసం నిరీక్షించాల్సి రానుంది. ఆ తర్వాత జనవరి 7 దాకా ప్రస్తుత ప్రభుత్వమే కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఈ 29 రోజుల గడువు పార్టీలకు కీలకం కానుంది. పార్టీల అభ్యర్ధుల ప్రకటన, అసమ్మతివాదుల బుజ్జగింపు, సభలు, నామినేషన్లు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, ప్రలోభాలు, పైసల పంపిణీ, మద్యం ఇలా రకరకాల విన్యాసాలకు ఈ 29 రోజులు కీలకంగా మారనున్నాయి.

- Advertisement -

గత రెండు ఎన్నికల్లో…

2014లో దేశంలోని 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇప్పటి బీఆర్‌ఎస్‌, అప్పటి టీఆర్‌ఎస్‌ 119 స్థానాలకుగాను 63 సీట్లు గెలుచుకుంది. సీఎం కేసీఆర్‌ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2019లో ఎన్నికలు జరగాల్సి ఉండగా… 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు సీఎం కేసీఆర్‌. అప్పుడు కూడా 119 స్థానలకుగాను 87 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారం చేజిక్కించుకున్నారు. 2018లో కాంగ్రెస్‌, టీడీపీ, తెలంగాణ జనసమితి, సీపీఐలు కలిసి ప్రజాకూటమిగా ఏర్పడినప్పటికీ 22 స్థానాలు మాత్రమే దక్కించుకున్నాయి.

ఇక, ఎంఐఎం ఏడు, ఇండిపెండెంట్లు రెండు, బీజేపీ ఒక సీటు- మాత్రమే గెలుచుకుంది. 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 46.87శాతం ఓట్లును సాధించింది. ఇక… కాంగ్రెస్‌కు 19 సీట్లు వచ్చినా 28.43శాతం ఓట్లు మాత్రమే సాధించగలిగింది. బీజేపీకి 6.98 శాతం ఓట్లతో సరిపెట్టుకుంది. 2018 తర్వాత జరిగిన ఉపఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ పుంజుకుంది. దుబ్బాక, హుజూరాబాద్‌లో బీజేపీ సభ్యులు గెలిచారు. మునుగోడులో బీఆర్‌ఎస్‌ గెలిచినా… బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది.

ఓటర్ల జాబితా వెబ్‌సైట్‌లో…

ఓటర్ల జాబితాను సీఈసీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. ఓటర్లు, రాజకీయ పార్టీలు బూత్‌ల వద్ద లేదా వెబ్‌సైట్‌లో ఓటర్ల జాబితాను చెక్‌ చేసుకోవచ్చని ఈసీ పేర్కొంది. గత ఎన్నికల సమయంలో కూడా అక్టోబర్‌ నెలలోనే షెడ్యూల్‌ వచ్చింది. బీఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్‌ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినా.. అధికారికంగా ప్రకటించలేదు. త్వరలో కాంగ్రెస్‌ తొలి జాబితా రానుంది.

సమరానికి సై..

జాతీయ స్థాయిలోనూ సమీకరణాలు మారుతున్నాయి. ఇండియా కూటమి ఏర్పాటు తరువాత జరుగుతున్న ఎన్నికలు కావటంతో ఆ కూటమికి ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇక, బీజేపీ సార్వత్రిక ఎన్నికల ముందు తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కర్ణాటక ఎన్నికల్లో గెలుపుతో ఇక దేశం మొత్తం ఇదే రకమైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్‌తో సహా ఇండియా కూటమి పార్టీలు అంచనా వేస్తున్నాయి.

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ లో బీజేపీ – కాంగ్రెస్‌ హోరా హోరీ తప్పదనే అభిప్రాయం ఉంది. ఇక, తెలంగాణలో అధికార బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ ఖాయమనే ధీమాతో ఉంది. తెలంగాణలో తమ గెలుపు ఖాయమని కాంగ్రెస్‌, బీజేపీ చెబుతున్నాయి. ఇప్పుడు షెడ్యూల్‌ విడుదల కావడంతో..ఇక రాజకీయ సమరానికి పార్టీలు సై అంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement