Saturday, November 23, 2024

Big Story | ఆన్‌లైన్‌లో ఆన్సర్​షీట్స్​ మూల్యాంకణం​.. పైలట్‌ ప్రాజెక్టుగా లాంగ్వేజెస్‌, ఆర్ట్స్‌ సబ్జెక్టులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: విద్యార్థులు ఏడాదంతా కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటారు. అయితే ఒక్కోసారి జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగే తప్పిదాల వల్ల విద్యార్థుల తలరాతలు మారే ప్రమాదమూ ఉంది. ఫలితాలప్పుడు ఫెయిల్‌ అయిన విద్యార్థి..రివ్యాల్యూయేషన్‌లో పాసైపోతారు. ఒక సబ్జెక్టులో జీరో మార్కులొచ్చిన విద్యార్థికి ఏకంగా పాస్‌ మార్కులొస్తాయి. ఒకవేళ ఆ విద్యార్థి రివ్యాల్యూయేషన్‌ చేసుకోకపోతే మరీ ఆ విద్యార్థి భవిష్యత్తు ఏంటీ?. కొందరు సెన్సిటివ్‌ విద్యార్థులైతే ఏకంగా ఆత్మహత్యలకు కూడా పాల్పడే ప్రమాదమూ లేకపోలేదు. గతంలో ఇలా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన విషయం తెలిసిందే. మూల్యాంకనంలో జరిగిన సాంకేతిక తప్పిదాల కారణంగా పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు.

ఈక్రమంలోనే ఏ ఒక్క విద్యార్థికి ఏ ఒక్కమార్కు నష్టపోకుండా ఉండేలా ఇంటర్‌ జవాబు పత్రాలను పటిష్టంగా, పారదర్శకంగా మూల్యాంకనం చేయాలని గత కొంత కాలంగా ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. ఈనేపథ్యంలోనే ఈ విద్యాసంవత్సరంలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆన్‌లైన్‌ మూల్యాంకనం కోసం 2022-23, 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు పబ్లిక్‌, అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ, రీ-ఎవాల్యుయేషన్‌ డిజిటల్‌ ఎవాల్యుయేషన్‌ కోసం ఏజెన్సీని ఎంపిక చేయాలని నిర్ణయించింది. దీనికోసం టెండర్లను బుధవారం నుంచి ఆహ్వానిస్తోంది. బిడ్‌ దాఖలుకు ఫిబ్రవరి 9వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించింది. ఈమేరకు తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

ఇంటర్‌ వార్షిక పరీక్షలు మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్‌ 4వరకు జరగనున్నాయి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. మేలో అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. అయితే మెయిన్‌ ఆప్షనల్‌ సబ్జెక్టులు (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, జువాలజీ, బాటనీ తదితర) ఆన్‌లైన్‌లో మూల్యాంకనం చేయకుండా లాగ్వేజెస్‌, ఆర్ట్స్‌ పేపర్లు మాత్రమే దిద్దనున్నారు. పైలట్‌ ప్రాజెక్టుగా ఈ విద్యా సంవత్సరం నుంచి దీన్ని అమలు చేయబోతున్నట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు చెప్తున్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా సత్ఫలితాలు వస్తే వచ్చే 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు మాత్రం అన్ని సబ్జెక్టులకు అమలు చేస్తామని చెప్పారు.

- Advertisement -

ఎలాంటి లోపాలు లేకుండా….
ఆన్‌లైన్‌లో జవాబు పత్రాలు దిద్దడం ద్వారా ఎలాంటి లోపాలకు ఆస్కారం ఉండదు. పారదర్శకంగా ప్రక్రియ ఉంటుంది. సమయం కూడా ఆదా అవుతోంది. అదే మాన్యువల్‌గా అయితే తప్పులు దొర్లడానికి అవకాశం ఉంటుంది. మార్కుల కౌంటింగ్‌లో తేడా ఉండే అవకాశం ఉంటుంది. వందలాది మంది అధ్యాపకులను మూల్యాంకన కేంద్రాలకు రప్పించి జవాబు పత్రాలను దిద్దడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ కలిపి దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తారు. వీరి పేపర్లను మాన్యువల్‌గా దిద్దాలంటే సుమారు నెలరోజుల సమయం పడుతోంది.

అదే ఆన్‌లైన్‌లో దిద్దాలంటే 15 నుంచి 20 రోజుల్లో దిద్దేస్తారు. ముఖ్యంగా మార్కుల విషయంలో, రీకౌంటింగ్‌లో విద్యార్థులకు మేలు జరుగుతుంది. విద్యార్థులు పరీక్ష రాసిన తర్వాత జవాబు పత్రాలను డిజిటలైజేషన్‌ చేసి ఆయా సబ్జెక్టుల లెక్చరర్లకు ప్రత్యేక లాగిన్‌ల ద్వారా అందజేయనున్నారు. అధ్యాపకులు వాటిని మూల్యాంకనం చేసి తిరిగి బోర్డుకు అదే లాగిన్‌ ద్వారా పంపేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా మార్కులను పరిగణలోకి తీసుకొని ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో దీన్ని అమలు చేయనున్నారు. అనంతరం పరిశీలించి రెండేళ్లకు వర్తింపజేయడంపై నిర్ణయం తీసుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement